Trump: అమెరికా ఆపరేషన్ వివరాల లీక్‌పై ట్రంప్ ఆగ్రహం.. మాలోనే ఒక గూఢచారి ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ వ్యవస్థలోనే ఒక గూఢచారి ఉన్నాడని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమానానికి చెందిన పైలట్‌ను రక్షించేందుకు యూఎస్ సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సున్నితమైన వివరాలు బయటకు లీక్ అయ్యాయని ఆయన వెల్లడించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన వెంటనే ఒక పైలట్‌ను అమెరికా బలగాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయని చెప్పారు. అయితే రెండో పైలట్ కోసం ఇంకా గాలిస్తున్నట్లు ఒక వార్తాసంస్థ కథనం ప్రచురించడంతో ఆ సమాచారం ఇరాన్ కు చేరిందన్నారు.దీంతో ఆపరేషన్ మరింత క్లిష్టంగా మారిందని తెలిపారు.
వివరాలు
సమాచారం వెల్లడించకపోతే జైలుశిక్ష
ఆ వార్త రాసిన జర్నలిస్టు తనకు సమాచారం ఎక్కడి నుంచి అందిందో వెల్లడించాలన్నారు.
లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచారం వెల్లడించకపోతే జైలుశిక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కఠినంగా స్పందించారు.
అయితే ఆ జర్నలిస్టు పేరు గానీ, ఆ వార్తా సంస్థ వివరాలు గానీ ట్రంప్ వెల్లడించలేదు.
లీక్‌కు కారణమైన వ్యక్తిని గుర్తించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ట్రంప్ తెలిపారు.
ఆ వ్యక్తి తమ వ్యవస్థలోనే ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. రెండో పైలట్ కోసం అమెరికా బలగాలు గాలిస్తున్నట్లు వార్త బయటకు వచ్చిన తర్వాతే ఇరాన్ అప్రమత్తమైందన్నారు.
అంతేకాకుండా ఆ పైలట్‌ను పట్టించిన వారికి భారీ బహుమతి ఇస్తామని ఆ దేశం ప్రకటించిందని చెప్పారు.
వివరాలు
ఆపరేషన్‌లో 155 విమానాలు..
దీని వల్ల రక్షణ చర్యలకు ఆటంకం కలిగిందని పేర్కొన్నారు.
గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తిని మానసిక రోగిగా అభివర్ణించిన ట్రంప్, అతడిని తప్పనిసరిగా పట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశమని అన్నారు.
ఎఫ్-15ఈ పైలట్‌ను రక్షించేందుకు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో మొత్తం 155 విమానాలు పాల్గొన్నట్లు ట్రంప్ వెల్లడించారు.
వీటిలో నాలుగు బాంబర్లు, 64 ఫైటర్ జెట్లు, 48 రీఫ్యూయలింగ్ విమానాలు, 13 రెస్క్యూ విమానాలు ఉన్నట్లు తెలిపారు.