Donald Trump: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్.. 'ఈగిల్ క్లా'తో స్ట్రాంగ్ మెసేజ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది. 'హార్ముజ్ జలసంధి మూసేస్తే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. వంతెనలు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తాం' అంటూ ట్రంప్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు ఇరాన్ కఠినంగా స్పందించింది. ఈసారి ఇరాన్ కేవలం మాటలకే పరిమితం కాకుండా, చరిత్రలో అమెరికాకు ఎదురైన అతిపెద్ద సైనిక పరాజయాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'చరిత్ర మళ్లీ పునరావృతమవుతుంది' అంటూ 1980లో జరిగిన 'ఆపరేషన్ ఈగిల్ క్లా' వైఫల్యాన్ని ప్రస్తావించింది. ఈ అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
నాడు ఏమి జరిగింది..?
1979లో ఇరాన్ విప్లవం తర్వాత టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన విద్యార్థులు 52 మంది అమెరికన్లను బందీలుగా పట్టుకున్నారు. వారిని రక్షించేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 1980 ఏప్రిల్ 24న 'ఆపరేషన్ ఈగిల్ క్లా' పేరుతో రహస్య సైనిక చర్య చేపట్టారు. అత్యాధునిక హెలికాప్టర్లు, ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోలతో ఈ మిషన్ ప్రారంభమైంది. కానీ అనూహ్యంగా ఎదురైన ప్రకృతి పరిస్థితులు, సాంకేతిక సమస్యలు ఈ ఆపరేషన్‌ను విషాదంగా మార్చాయి.
వివరాలు
ఇసుక తుపాను ముప్పు
ఇరాన్ ఎడారిలో అకస్మాత్తుగా ఉద్ధృతంగా వీచిన ఇసుక తుపాను (హబూబ్) కారణంగా హెలికాప్టర్ల ప్రయాణం తీవ్రంగా దెబ్బతింది. దాంతో పాటు మూడు హెలికాప్టర్లు సాంకేతిక లోపాలతో నిలిచిపోయాయి. మిషన్‌ను నిలిపివేసి వెనక్కి వెళ్లే సమయంలో ఒక హెలికాప్టర్, ఇంధనం నింపుతున్న రవాణా విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారీ పేలుడు సంభవించి 8 మంది అమెరికా సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన సైనికులు ప్రాణభయంతో సహచరుల మృతదేహాలు, విమానాలు, రహస్య పత్రాలను అక్కడే వదిలి వెనుదిరిగారు.
వివరాలు
అగ్రరాజ్యానికి పరువు నష్టం
ఈ వైఫల్యం అమెరికా సైనిక శక్తిపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు రేకెత్తించింది. ఈ ఘటన జిమ్మీ కార్టర్ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసి, ఎన్నికల్లో ఓటమికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఇరాన్ మాత్రం ఈ ఘటనను దైవ అనుగ్రహంగా భావిస్తూ, అమెరికా బలహీనతకు నిదర్శనంగా ఇప్పటికీ ప్రస్తావిస్తోంది. తాజాగా ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అదే తబాస్ ఎడారి వైఫల్యాన్ని గుర్తు చేస్తూ, మరోసారి అలాంటి తప్పు చేయవద్దని పరోక్షంగా హెచ్చరించింది. ట్రంప్ వ్యాఖ్యలను 'అసంబద్ధమైనవి'గా ఖండించింది.