Donald Trump: 80 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ట్రంప్.. అమెరికా వైద్యుల నిర్ధారణ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, దేశానికి సేవలందించేందుకు అన్ని విధాలుగా సమర్థులని శ్వేతసౌధం వైద్య బృందం వెల్లడించింది. ఈ నెల 26న వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ట్రంప్‌కు 22 మంది నిపుణులైన వైద్యులు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన అధికారిక వైద్యుడు షాన్ బార్బెల్ శనివారం తెలిపారు. వచ్చే నెలలో 80వ ఏట అడుగుపెట్టనున్న ట్రంప్ ప్రస్తుతం 108 కిలోల బరువుతో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
మచ్చలపై వివరణ ఇచ్చిన వైద్యులు
ఇటీవల ట్రంప్ చేతులపై కనిపించిన మచ్చల గురించి కూడా వైద్యులు వివరణ ఇచ్చారు. తరచూ కరచాలనాలు చేయడం వల్ల ఏర్పడిన స్వల్ప సాఫ్ట్ టిష్యూ ఇరిటేషన్ కారణంగానే ఆ మచ్చలు వచ్చినట్లు షాన్ బార్బెల్ వెల్లడించారు. గతేడాది ట్రంప్ దీర్ఘకాలిక సిరల వ్యాధి (వీనస్ ఇన్‌సఫీషియెన్సీ)తో బాధపడుతున్నట్లు శ్వేతసౌధం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా వైద్య పరీక్షల్లో కూడా ఆయన కాళ్ల దిగువ భాగంలో స్వల్ప వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే గతంతో పోలిస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్య బృందం స్పష్టం చేసింది.