LOADING...
Donald Trump: 5 బిలియన్‌ డాలర్ల దావా వేస్తా.. బీబీసీకి ట్రంప్‌ భారీ లీగల్‌ వార్నింగ్
5 బిలియన్‌ డాలర్ల దావా వేస్తా.. బీబీసీకి ట్రంప్‌ భారీ లీగల్‌ వార్నింగ్

Donald Trump: 5 బిలియన్‌ డాలర్ల దావా వేస్తా.. బీబీసీకి ట్రంప్‌ భారీ లీగల్‌ వార్నింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని క్యాపిటల్‌ హిల్‌పై 2021లో చోటుచేసుకున్న దాడి సందర్భంగా అప్పటి అధ్యక్షుడు, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రసంగాన్ని బీబీసీ తప్పుడు రీతిలో ఎడిట్‌ చేసి ప్రసారం చేసిన విషయం పెద్ద వివాదంగా మారింది. తన మాటలను మార్చి తప్పుదారి పట్టించేలా చూపించారని ఆరోపిస్తూ, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్‌ ఆ మీడియా సంస్థపై భారీ దావా వేస్తానని హెచ్చరించారు. ఇప్పటికే తన న్యాయబృందం బీబీసీకి లేఖ రాసి, ట్రంప్‌ పరువునష్టం కలిగించినందుకు బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. ఈ వివాదంపై క్షమాపణలు తెలిపిన బీబీసీ, ట్రంప్‌ కోరిన బిలియన్‌ డాలర్ల పరిహారాన్ని చెల్లించేందుకు నిరాకరించింది

Details

పనోరమా డాక్యుమెంటరీలో తప్పుడు రీతిలో ఎడిట్‌ చేసి ప్రసారం

దీంతో బీబీసీపై దావా తప్పదని ట్రంప్‌ మరోసారి హెచ్చరిస్తూ, వచ్చే వారంలో ఆ సంస్థపై 1 బిలియన్‌ డాలర్ల నుంచి 5 బిలియన్‌ డాలర్ల వరకు లీగల్‌ కేసు దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో కూడా చర్చించనున్నట్లు వెల్లడించారు. 2021 జనవరి 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌పై ట్రంప్‌ అనుచరులు దాడి చేసిన సమయంలో ఆయన సుమారు గంటపాటు చేసిన ప్రసంగమే ఈ వివాదానికి కేంద్రబిందువైంది. ఈ ప్రసంగాన్ని బీబీసీ తన పనోరమా డాక్యుమెంటరీలో తప్పుడు రీతిలో ఎడిట్‌ చేసి ప్రసారం చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ సంస్థలో డైరెక్టర్‌ జనరల్‌ డేవీ, న్యూస్‌ చీఫ్‌ డెబోరా టర్నెస్‌ రాజీనామా చేశారు.