LOADING...
Donald Trump: దావోస్‌లో గాజా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్‌.. సభ్యదేశంగా పాక్
దావోస్‌లో గాజా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్‌.. సభ్యదేశంగా పాక్

Donald Trump: దావోస్‌లో గాజా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్‌.. సభ్యదేశంగా పాక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో శాంతి స్థాపన లక్ష్యంగా 'గాజా శాంతి మండలి' (Board of Peace on Gaza)ను ప్రారంభించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఈ మండలి ఏర్పాటును ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. "ప్రతి దేశం ఈ శాంతి మండలిలో భాగస్వామ్యం కావాలి. ఐక్యరాజ్య సమితితో పాటు అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని తెలిపారు. ఈ మండలిలో పాకిస్థాన్ సభ్యదేశంగా ఉండటం విశేషంగా మారింది. గాజా పునర్నిర్మాణం, పరిపాలన వ్యవస్థను పర్యవేక్షించేందుకు కొద్ది రోజుల క్రితమే ఈ మండలి ఏర్పాటు గురించి ట్రంప్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

వివరాలు 

మండలికి ట్రంప్‌ ఛైర్మన్

ఈ మండలికి ట్రంప్‌ ఛైర్మన్‌. మొదట్లో ఆ హోదాలో ఆయన కొంత మంది సభ్యులను మాత్రమే నియమిస్తారని తొలుత అంతా భావించినా,ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు 50కు పైగా దేశాధినేతలకు ఆయన ఆహ్వానాలు పంపారు. ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు అనేక దేశాల నాయకులు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ గాజా శాంతి మండలిని ట్రంప్ ముందుకు తీసుకొస్తున్నారనే చర్చ అంతర్జాతీయంగా ఊపందుకుంది.

వివరాలు 

శాశ్వత సభ్యత్వం పొందాలనుకునే ప్రతి దేశం ఒక బిలియన్ డాలర్లు చెల్లించాలి 

ఈ విషయమై ట్రంప్ స్పందిస్తూ.. "ఐరాస మరింత సమర్థంగా పని చేసి ఉంటే, ఈ శాంతి మండలి అవసరమే ఉండేది కాదు" అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో ఈ మండలి కేవలం గాజాకే పరిమితమైనది కాదని స్పష్టమవుతోంది. ఇందులో శాశ్వత సభ్యత్వం పొందాలనుకునే ప్రతి దేశం ఒక బిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో రూ.9 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

Advertisement

వివరాలు 

హమాస్‌కు వార్నింగ్‌..

గాజా శాంతి మండలి ఏర్పాటుకు సంబంధించి ట్రంప్ నేతృత్వంలో పలువురు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఆ జాబితాలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మిలిటెంట్ సంస్థ హమాస్‌కు కఠిన హెచ్చరిక జారీ చేశారు. "హమాస్ ఆయుధాలు విడిచిపెట్టేందుకు ఒప్పుకోకపోతే, వారి అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ట్రంప్ చొరవతో కుదిరిన 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగానే ఈ గాజా శాంతి మండలిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Advertisement