Trump: అమెరికాలో ఉద్యోగానికి రూ.85 లక్షల ఫీజు?.. ట్రంప్ సర్కార్ కొత్త ఆలోచన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. చదువు పూర్తైన అనంతరం అమెరికాలో ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగపడే 'ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్' (OPT) కార్యక్రమానికి ఏకంగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.85 లక్షలకు సమానం. ఈ అంశంపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంలో అంతర్గత స్థాయిలో చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
విదేశీ విద్యార్థుల్లో ఆందోళన
ప్రస్తుతం ఎఫ్-1 విద్యార్థి వీసాపై అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తైన తర్వాత OPT ద్వారా ఒక సంవత్సరం వరకు ఉద్యోగం చేసే అవకాశం పొందుతున్నారు.
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు పూర్తి చేసిన వారికి ఈ గడువు మూడేళ్ల వరకు ఉంటుంది.
అనంతరం వారు హెచ్-1బీ ఉద్యోగ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం పొందుతారు.
అయితే ఇప్పుడు OPT సదుపాయాన్ని పొందేందుకు భారీ మొత్తంలో ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదన వెలుగులోకి రావడంతో విదేశీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
వివరాలు
ఈ మార్పులు అమల్లోకి రావాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి
ఇదే సమయంలో విద్యార్థి వీసాలకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతి లభిస్తుండగా, కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే చాలా మంది విదేశీ విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్లపాటు మాత్రమే నివాస అనుమతి ఉండే అవకాశం ఉంది.
అంతకంటే ఎక్కువ కాలం చదువుకోవాల్సి వస్తే గడువు ముగిసేలోపు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ మార్పులు అమల్లోకి రావాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి.
వివరాలు
3.3 లక్షల భారత విద్యార్థులపై ప్రభావం
ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారత విద్యార్థులపై గణనీయమైన ప్రభావం పడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షలకుపైగా భారతీయ విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారు.
OPT కోసం భారీ ఫీజు అమలు చేస్తే విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించేందుకు సంస్థలు వెనుకంజ వేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే OPTపై లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనకు ఇప్పటివరకు తుది ఆమోదం లభించలేదని, ప్రస్తుతం అది పరిశీలన దశలోనే ఉందని సమాచారం.