LOADING...
Donald Trump: హర్మూజ్‌ జలసంధి మూసివేతపై ట్రంప్‌ కీలక ప్రకటన.. చమురు ట్యాంకర్లకు అమెరికా రక్షణ!
చమురు ట్యాంకర్లకు అమెరికా రక్షణ!

Donald Trump: హర్మూజ్‌ జలసంధి మూసివేతపై ట్రంప్‌ కీలక ప్రకటన.. చమురు ట్యాంకర్లకు అమెరికా రక్షణ!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే హర్మూజ్‌ జలసంధి మీదుగా ప్రయాణించే చమురు ట్యాంకర్లకు అమెరికా నౌకాదళం రక్షణ కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్‌ మాట్లాడుతూ,ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటం కోసం అమెరికా తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో చేసిన పోస్టులో వెల్లడించారు.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు సుమారు 73 డాలర్లు 

అలాగే గల్ఫ్‌ ప్రాంతం మీదుగా సముద్ర మార్గాల్లో జరిగే వాణిజ్యానికి ఆర్థిక భద్రత కల్పించాల్సిందిగా, తక్కువ ప్రీమియంతో బీమా సదుపాయాలు, అవసరమైన ఇతర హామీలను వెంటనే అందించాలని యూఎస్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కు ఆదేశించినట్లు ట్రంప్‌ తెలిపారు. ట్రంప్‌ ప్రకటన అనంతరం అంతర్జాతీయ చమురు మార్కెట్లు కొంతమేర స్థిరపడ్డాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు సుమారు 73 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

ట్రంప్‌ తాజా ప్రకటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం

ఇటీవల ఇది 80 డాలర్లకు పైగా ట్రేడ్‌ అయిన విషయం తెలిసిందే. మరోవైపు హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నామని, ఆ ప్రాంతానికి నౌకలు చేరుకుంటే దాడులు చేసే అవకాశం ఉందని ఇరాన్‌ నిన్న హెచ్చరించింది. దీనివల్ల ఈ మార్గం ద్వారా జరిగే చమురు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. హర్మూజ్‌ జలసంధి పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో నౌకలు నిలిచిపోయినట్లు మారిటైమ్‌ అనలిటిక్స్‌ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ చేసిన తాజా ప్రకటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.

Advertisement