US Visa: అమెరికా వీసా నిబంధనల్లో కొత్త మార్పులు.. మధుమేహం,ఊబకాయం ఉన్నవారికి కఠినతరంగా మారనున్న వీసా ప్రక్రియ
ఈ వార్తాకథనం ఏంటి
మధుమేహం (షుగర్) లేదా ఊబకాయం (ఒబేసిటీ) వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఇకపై అమెరికా వీసా పొందడం కష్టతరమయ్యే అవకాశం ఉంది. అలాగే గుండె వ్యాధులు లేదా తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో ఉన్నవారికి కూడా వీసా దరఖాస్తు తిరస్కరణ చెందే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే ఉన్న వైద్య పరీక్షా నిబంధనల్లో సవరణలు చేసింది. ఇప్పుడు మధుమేహం, ఊబకాయం వంటి అంశాలను కూడా వైద్య పరిశీలనలో భాగంగా చేర్చింది. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాలు (ఎంబసీలు), కాన్సులేట్లకు పంపినట్టు ఆ దేశంలోని 'కేఎఫ్‌ఎఫ్ హెల్త్ న్యూస్' వెబ్‌సైట్ వెల్లడించింది.
వివరాలు
భుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం
ఇప్పటికే ఊబకాయం సమస్యతో ప్రపంచంలోనే ప్రధానంగా నిలిచిన అమెరికా, ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ఉన్న విదేశీయుల ప్రవేశాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. తద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయానికి వెనుక ఉన్న ప్రధాన కారణమని చెబుతున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం, వృద్ధాప్యంలో ఉన్నవారు లేదా అమెరికాలోకి వెళ్లిన తర్వాత ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడే పరిస్థితిలో ఉన్నవారికి కూడా వీసా పొందడం కష్టమవుతుందని వలస నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు
వలసలను కొంత మేరకు తగ్గించడానికే ఈ కొత్త నిబంధన
"వీసా దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాలి.గుండె సంబంధిత వ్యాధులు, తీవ్రమైన శ్వాస సమస్యలు,క్యాన్సర్,మధుమేహం,నాడీ సంబంధిత వ్యాధులు,మానసిక ఆరోగ్య సమస్యలు మొదలైన అంశాలను విశదంగా పరిశీలించాలి.ఈ వ్యాధుల చికిత్సకు వందలాది లేదా వేలాది డాలర్ల వ్యయం అవుతుంది.అందువల్ల,వారు అమెరికాలోకి వచ్చాక ప్రభుత్వ సహాయం అవసరమవుతుందనే అనుమానం ఉన్నప్పుడు వీసాను నిరాకరించాలి.అయితే,దరఖాస్తుదారుడు తన చికిత్స, ఆరోగ్య సంరక్షణ ఖర్చును స్వయంగా భరించగల ఆర్థిక స్థోమత కలిగి ఉంటే వీసా మంజూరు పరిగణనలోకి తీసుకోవచ్చు.అదేవిధంగా, వారి కుటుంబ సభ్యులలో ఎవరికైనా తీవ్రమైన వ్యాధులు లేదా వైకల్యాలు ఉన్నాయా అన్నదీ పరిశీలించాలి"అని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. ఈ కొత్త నిబంధనల ద్వారా అమెరికా ప్రభుత్వం వలసలను కొంత మేరకు తగ్గించడానికే ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.