Trump: యేసు అవతారంలో ట్రంప్.. AI చిత్రంతో మరింత హీట్.. సోషల్ మీడియాలో చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కేథలిక్ చర్చ్‌పై, అలాగే పోప్ పోప్ లియో XIV పై తీవ్ర విమర్శలు చేశారు. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాను యేసు చేసినట్టు అద్భుతం చేస్తున్నట్లు చూపించే కృత్రిమ మేధస్సుతో రూపొందించిన చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ట్రంప్ పొడవాటి వస్త్రాలు ధరించి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై చేయి ఉంచి అతడిని స్వస్థపరుస్తున్నట్టుగా చూపించారు. అంతేకాకుండా అమెరికా జెండా, సైనిక విమానాల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ట్రంప్, పోప్ లియోను లక్ష్యంగా చేసుకుని.. "నేరాల విషయంలో బలహీనుడు.. విదేశాంగ విధానాల్లో దారుణంగా వ్యవహరిస్తున్నారు" అంటూ విమర్శించారు.
వివరాలు
పోప్ అభిప్రాయాలు రాజకీయ ప్రేరణతో ఉన్నాయి: ట్రంప్
పోప్ అభిప్రాయాలు రాజకీయ ప్రేరణతో ఉన్నాయని ఆరోపించారు. ఇరాన్ ఉద్రిక్తతలు సహా గ్లోబల్ సమస్యలపై వాషింగ్టన్ విధానాలను పోప్ విమర్శించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఆశయాల విషయంలో పోప్ కఠినంగా వ్యవహరించడం లేదని, విదేశాల్లో అమెరికా సైనిక చర్యలపై కూడా తప్పుగా స్పందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. తన ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ తన ప్రభుత్వ విధానాలను సమర్థించుకుంటూ, కఠిన చట్టవ్యవస్థ, దూకుడైన విదేశాంగ విధానాల కోసం తాను భారీ మెజారిటీతో ఎన్నికయ్యానని తెలిపారు. ప్రగతిశీల భావాలున్న రాజకీయ నేతలతో పోప్ కలవడం సరికాదని, రాజకీయ నాయకుడిలా కాకుండా మంచి పోప్‌గా ఉండాలని సూచించారు.
వివరాలు
పోప్ పనితీరుపై అసంతృప్తి
తరువాత జాయింట్ బేస్ ఆండ్ర్యూస్‌లో మాట్లాడుతూ కూడా పోప్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాలో జన్మించిన తొలి పోప్ అయిన లియో XIV, అమెరికా విదేశాంగ విధానాలు, సైనిక చర్యలపై తరచూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ సమస్యల్లో దౌత్యపరమైన పరిష్కారాలు, మానవతా దృక్పథం అవసరమని ఆయన పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధంపై విమర్శలు చేస్తూ విధ్వంస బెదిరింపులను "అసలు అంగీకరించలేనివి"గా పేర్కొన్నారు. ట్రంప్ నుంచి వచ్చిన ఈ బహిరంగ విమర్శలు ఇద్దరి మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచాయి.