Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం.. ఆహార దిగుమతులపై సుంకాల తగ్గింపు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో పెరుగుతున్న ధరల ఒత్తిడిని తగ్గించేందుకు, రాజకీయంగా ఎదురవుతున్న విమర్శలను సమతుల్యం చేసుకునేందుకు ట్రంప్ సర్కార్ ఒక కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరల పెరుగుదలను నియంత్రించేందుకు భాగంగా పలు ఆహార ఉత్పత్తుల దిగుమతులపై విధించిన సుంకాలను తగ్గిస్తున్నట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ నిర్ణయం భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మామిడి, దానిమ్మ, టీ వంటి వ్యవసాయ ఉత్పత్తులకు లాభదాయకంగా మారనుంది. వైట్‌హౌస్ శుక్రవారం విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం, ట్రాపికల్ పండ్లు, పండ్ల రసాలు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, కోకో, నారింజ, టమోటాలు, బీఫ్ వంటి ఉత్పత్తులపై ఉన్న దిగుమతి సుంకాలను పూర్తిగా తొలగించారు.
Details
ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయి
గతంలో ట్రంప్ ప్రభుత్వం భారత్ సహా పలు దేశాలపై 25 శాతం సుంకాలు విధించగా, రష్యాతో చమురు వాణిజ్యం కొనసాగుతున్నందుకు అదనంగా ఇంకో 25 శాతం భారం మోపిన సంగతి తెలిసిందే. ఈ సుంకాల ప్రభావంతో అమెరికాలో అనేక ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియాలో నిర్వహించిన ఎన్నికల్లో డెమొక్రాట్లు ధరల నియంత్రణ సమస్యను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రచారం చేసి విజయాలు సాధించారు. పెరుగుతున్న ధరలు ఓటర్లకు భారమై, ట్రంప్ ప్రభుత్వంపై గట్టి విమర్శలు వెల్లువెత్తాయి.
Details
కొన్ని ఆహార ఉత్పత్తులు ధరలు ఇంకా అధికంగా ఉన్నాయి
ఎన్‌బీసీ న్యూస్ నిర్వహించిన సర్వే ప్రకారం 63 శాతం అమెరికన్లు ధరల నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ట్రంప్ విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ ఈ విమర్శలను పూర్తిగా తిరస్కరించారు. ఇవన్నీ డెమొక్రాట్లు చేస్తున్న 'కంప్లీట్ కాన్ జాబ్' (పూర్తి మోసం) అని వ్యాఖ్యానించారు. బైడెన్ అధికార కాలంలో ద్రవ్యోల్బణం 19.7 శాతానికి చేరిందని గుర్తుచేశారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం 3 శాతం వద్ద ఉన్నప్పటికీ, కొన్ని ప్రధాన ఆహార ఉత్పత్తుల ధరలు ఇంకా అధికంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.