Donald Trump: ట్రంప్ ఎడమ చేతిపై గాయం.. మరోసారి ఆరోగ్యంపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఆయన ఎడమ చేతిపై గాయం కనిపించడమే దీనికి కారణమైంది. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని ట్రంప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన ఎడమ చేతిపై గాయం స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. శాంతి మండలి కార్యక్రమంలో బల్ల మూలకు చేయి తగలడంతో గాయమైందని ఆమె తెలిపారు.
Details
స్వల్ప సమస్య మాత్రమే ఉంది
ట్రంప్ కూడా దీనిపై స్పందిస్తూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, గాయానికి చికిత్స తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్లు సూచించిన దానికంటే ఎక్కువ మోతాదులో ఆస్ప్రిన్ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో కూడా ట్రంప్ చేతికి ఇలాంటి గాయాలు ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అప్పట్లోనూ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను వైట్‌హౌస్ వెంటనే ఖండించింది. రక్తనాళాలకు సంబంధించిన స్వల్ప సమస్య ఉందని, అది వృద్ధుల్లో సాధారణంగా కనిపించేదేనని అప్పట్లో వివరణ ఇచ్చింది.