Loading...
Visa bond program: 50 దేశాలకు ట్రంప్ షాక్‌.. 20 వేల డాలర్ల బాండ్ చెల్లిస్తేనే అమెరికా వీసా!
50 దేశాలకు ట్రంప్ షాక్‌.. 20 వేల డాలర్ల బాండ్ చెల్లిస్తేనే అమెరికా వీసా!

Visa bond program: 50 దేశాలకు ట్రంప్ షాక్‌.. 20 వేల డాలర్ల బాండ్ చెల్లిస్తేనే అమెరికా వీసా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఆయన ప్రభుత్వం 50 దేశాల పౌరుల కోసం బీ-1 (వ్యాపారం), బీ-2 (పర్యాటకం) వీసాలపై శాశ్వత 'వీసా బాండ్ ప్రోగ్రామ్'ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం, ఎంపిక చేసిన దేశాల నుంచి అమెరికాకు వెళ్లే సందర్శకులు గరిష్ఠంగా 20 వేల డాలర్ల వరకు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్టుగా అమలైన యూఎస్ వీసా బాండ్ ప్రోగ్రామ్ను ఇప్పుడు కొన్ని మార్పులతో శాశ్వతంగా అమలు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానున్నాయి.

వివరాలు

పైలట్ ప్రోగ్రామ్‌కు మంచి ఫలితాలు

వ్యాపారం, పర్యాటకం వంటి తాత్కాలిక అవసరాల కోసం అమెరికాకు వచ్చే సందర్శకుల్లో వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోయే (వీసా ఓవర్‌స్టే) వారి సంఖ్యను తగ్గించడంలో ఈ పథకం విజయవంతమైందని అధికారులు గుర్తించారు.

దీంతో దీన్ని శాశ్వత విధానంగా మార్చాలని నిర్ణయించారు.

బాండ్ మొత్తంలో భారీ మార్పులు

ఫెడరల్ రిజిస్టర్ నోటీసు ప్రకారం, పైలట్ ప్రోగ్రామ్‌లో 5,000 డాలర్లు, 10,000 డాలర్లు, 15,000 డాలర్లు అనే మూడు బాండ్ ఆప్షన్లు ఉండేవి.

అయితే తాజా నిబంధనల్లో 5,000 డాలర్ల ఆప్షన్‌ను పూర్తిగా తొలగించారు. అలాగే గరిష్ఠ బాండ్ మొత్తాన్ని 15 వేల డాలర్ల నుంచి 20 వేల డాలర్లకు పెంచారు.

వివరాలు

ఈ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?

వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఎక్కువగా ఉండిపోయే (వీసా ఓవర్‌స్టే) 50 దేశాల పౌరులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

ఈ జాబితాలో ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాలున్నాయి.

అయితే భారత్ ఈ జాబితాలో లేకపోవడం భారతీయులకు ఊరటనిచ్చే అంశం.

ADVERTISEMENT

వివరాలు

బాండ్ ఎప్పుడు తిరిగి వస్తుంది?

ఈ బాండ్ విధానంలో ఉన్న ప్రయాణికులు కేవలం కమర్షియల్ విమానాల ద్వారానే అమెరికాకు వెళ్లి రావాలి.

వీసా దరఖాస్తు తిరస్కరించబడినా లేదా వీసా గడువు ముగిసేలోపు అమెరికా విడిచి వచ్చినా, వారు చెల్లించిన బాండ్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి పొందుతారు.

అయితే, వీసా గడువు ముగిసినా అమెరికాలోనే కొనసాగితే, చెల్లించిన బాండ్ మొత్తాన్ని అమెరికా ప్రభుత్వం స్వాధీనం (ఫ్రీజ్) చేసుకుంటుంది.

ఈ చర్య ద్వారా వీసా నిబంధనల ఉల్లంఘనలను మరింత సమర్థంగా నియంత్రించాలని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT