
Trump Tariffs: విదేశీ సినిమాలపై ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. 100% సుంకం విధింపు
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక నిర్ణయంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇకపై అమెరికా వెలుపల నిర్మించి, అమెరికాలో విడుదల చేసే ప్రతి చిత్రంపై 100 శాతం సుంకం విధించనున్నట్టు తన 'ట్రూత్ సోషల్'లో స్పష్టంచేశారు. అమెరికా బయట నిర్మించే సినిమాలను ఇక్కడ విడుదల చేస్తే 100 శాతం సుంకం వసూలు చేస్తాం. ఇతర దేశాలు మా సినిమా వ్యాపారాన్ని దోచుకుపోయాయి. ఇది చిన్న పిల్లవాడి చేతిలోంచి మిఠాయిని లాక్కోవడంలా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాకు ఉన్న బలహీనమైన, అసమర్థ గవర్నర్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.
Details
ప్రతి చిత్రంపై 100% సుంకం
ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు యునైటెడ్ స్టేట్స్ వెలుపల నిర్మించే ప్రతి చిత్రంపైనా 100% సుంకం విధించాల్సిందేనని తెలిపారు. ఈ చర్యతో అమెరికా సినిమా పరిశ్రమను మళ్లీ అగ్రస్థానంలో నిలబెడతానని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అమెరికన్ సినిమాలకు ప్రతీకగా నిలిచిన హాలీవుడ్ ప్రస్తుతం కష్టాల్లో ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడంతో, బాక్సాఫీస్ కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయని చెప్పారు.
Details
అమలు విధానంపై ఇంకా రాని స్పష్టత
అయితే ఈ కొత్త సుంకాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి? వాటి అమలు విధానం ఎలా ఉంటుంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ట్రంప్ నిర్ణయం భారతీయ సినిమాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపనుందన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా అమెరికాలో భారీ మార్కెట్ కలిగిన తెలుగు చిత్రాల విడుదలకు ఇది పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.