Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఇక వినాశకర దాడులే!
ఈ వార్తాకథనం ఏంటి
హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణ కొనసాగిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఇరాన్‌పై మరింత విధ్వంసకర స్థాయిలో దాడులు చేపడతామని స్పష్టం చేశారు. మేరీల్యాండ్‌లోని క్యాంప్ డేవిడ్ ప్రెసిడెన్షియల్ రీట్రీట్‌లో తన కేబినెట్ సభ్యులతో సమావేశమైన ట్రంప్, హార్మూజ్ జలసంధిని ఇరాన్ బేషరతుగా తెరవాల్సిందేనని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా జరుగుతున్న చర్చలు పూర్తిగా విఫలమైతే ఇరాన్‌పై మరోసారి భారీ స్థాయిలో సైనిక దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. మా దాడులను ఇరాన్ విజయవంతంగా అడ్డుకుంటుందని నేను అస్సలు అనుకోవడం లేదు. వారి నౌకాదళం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింది. గగనతల రక్షణ వ్యవస్థ కూడా నిర్వీర్యమైంది.
వివరాలు
కువైట్‌పై ఇరాన్ దాడుల యత్నం
ఇటీవల అమెరికా దాడుల తీవ్రత తగ్గడంతో వారు కొంతవరకు సైనికంగా కోలుకున్నా, ఇకపై అమెరికా దాడులను మరింత తీవ్రతరం చేస్తుంది.
గెలుపే మా లక్ష్యం. ఇక దాడులను భరించలేమని ఇరాన్ కాళ్లబేరానికి వచ్చేంత వరకు చర్యలు కొనసాగిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాకు మిత్రదేశమైన కువైట్‌పై కూడా ఇరాన్ శనివారం దాడులకు ప్రయత్నించింది. అయితే ఇరాన్ పంపిన డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్లు కువైట్ రక్షణ శాఖ వెల్లడించింది.
అత్యంత కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు యత్నించిందని, ముఖ్యంగా బుబియాన్ ద్వీపంలోని వాహన తయారీ కర్మాగారంపై దాడి చేసేందుకు ప్రయత్నించినా, ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశామని కువైట్ రక్షణ శాఖ అధికార ప్రతినిధి జనరల్ అబ్దుల్‌అజీజ్ తెలిపారు.
వివరాలు
ట్యాంకర్ నౌకపై దాడి
మరోవైపు ఒమన్‌లోని లీమా సమీపంలోని హార్మూజ్ జలసంధిలో ఓ ట్యాంకర్ నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు బ్రిటన్ నౌకాదళం వెల్లడించింది.
అలాగే ఖాసాబ్ నగరానికి వాయవ్యంగా 21 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ప్రయాణిస్తున్న మరో సరుకు రవాణా నౌక సమీపంలో పేలుడు సంభవించినట్లు తెలిపింది.
అయితే ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.