Trump: 'ఇరాన్ చర్చలకు రాకపోయినా, నాకేమీ అభ్యంతరం లేదు': డొనాల్డ్ ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరిగిన శాంతి చర్చలు ఫలించకపోవడంతో, ఇరాన్ మళ్లీ చర్చలకు వచ్చినా రాకపోయినా తనకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఫ్లోరిడా పర్యటన ముగించుకుని మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చల సమయంలో ఇరాన్ అణ్వాయుధాలపై ఉన్న పట్టుదల మరోసారి బయటపడిందని ట్రంప్ ఆరోపించారు. "వారికి ఇంకా అణ్వాయుధం కావాలనే ఆశ స్పష్టంగా కనిపించింది. అయితే ఇరాన్‌కు అణ్వాయుధం ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం" అని ఆయన స్పష్టం చేశారు. చర్చలు జరుగుతున్నప్పుడే ట్రంప్.. ఒప్పందం కుదిరినా కుదరకపోయినా అమెరికాకే విజయమని వ్యాఖ్యానించడం గమనార్హం.
వివరాలు
ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసిన చర్చలు
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో వారాంతంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య కాల్పుల విరమణపై కీలక స్థాయి చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఈ సమావేశాల్లో పాల్గొంది. సుమారు 21గంటలపాటు సాగిన ఈ చర్చలు చివరికి ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడానికి సిద్ధంగా లేకపోవడమే ఈ వైఫల్యానికి కారణమని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి.
వివరాలు
అమెరికా కీలక నిర్ణయం
చర్చలు విఫలమైన వెంటనే అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. Strait of Hormuz గుండా రాకపోకలు సాగించే ఇరాన్ నౌకలపై నౌకా దిగ్బంధనం అమలు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 22తో ముగియనుంది.