Trump: ముగింపు దిశగా ఇరాన్ యుద్ధం.. కాల్పుల విరమణ పొడిగింపుపై కసరత్తు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం త్వరలో ముగిసే దశకు చేరుకుందని, దానికి తాము అత్యంత దగ్గరలో ఉన్నామని వెల్లడించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇదే సమయంలో అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చల ఏర్పాటుకు మధ్యవర్తుల కసరత్తు వేగవంతమైంది. ఈ క్రమంలో పాకిస్థాన్ తన సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ నేతృత్వంలో బృందాన్ని టెహ్రాన్‌కు పంపింది. మరోవైపు ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది. దీనిపై ఆగ్రహించిన టెహ్రాన్.. దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే ప్రాంతీయ వాణిజ్య కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్ర ప్రాంతాల్లో ఎగుమతులు, దిగుమతులు నిలిపివేస్తామని ప్రకటించింది.
వివరాలు
ఇరాన్ అణ్వస్త్రాలను తయారుచేసుకునేది: ట్రంప్
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇరాన్‌తో యుద్ధం దాదాపు ముగిసినట్లే ఉందని ట్రంప్ పేర్కొన్నారు.
అయితే పూర్తి పరిష్కారం కోసం చర్చలు అవసరమని స్పష్టం చేశారు.
తాము అడ్డుకోకపోతే ఇరాన్ ఇప్పటికే అణ్వస్త్రాల తయారీలో ముందడుగు వేసేదని అన్నారు.
ఆ దేశంపై సైనిక చర్యను పూర్తిగా నిలిపివేయలేదని, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కాల్పుల విరమణ గడువు పొడిగింపుకంటే శాశ్వత శాంతి ఒప్పందంపైనే తమ దృష్టి ఉందని చెప్పారు.
యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. అలాగే ఇరాన్‌కు ఆయుధాలు అందించకూడదని చైనా అంగీకరించిందని వెల్లడించారు.
వివరాలు
మరో రెండు వారాలపాటు కాల్పుల విరమణ?
అమెరికా-ఇరాన్ మధ్య అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 22తో ముగియనుంది.
దాన్ని కనీసం మరో రెండు వారాలపాటు పొడిగించాలనే యోచనలో మధ్యవర్తులు ఉన్నట్లు సమాచారం.
దీనివల్ల శాశ్వత ఒప్పందానికి దారి సుగమం అవుతుందని భావిస్తున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం, హర్మూజ్ జలసంధి, యుద్ధ నష్ట పరిహారం అంశాల్లో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల తొలి విడత చర్చలు విఫలమయ్యాయి.
ఈఅంశాలపై రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
తమ యురేనియం శుద్ధి కార్యక్రమంపై చర్చించేందుకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి తెలిపారు.
అయితే అవసరాల మేరకు శుద్ధి కొనసాగించే హక్కు తమకు ఉండాలని స్పష్టం చేశారు.
ఇదేసమయంలో లెబనాన్ ప్రభుత్వం హెజ్‌బొల్లా ప్రభావాన్ని తగ్గించుకోవాలని చూస్తోందని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి తెలిపారు.
వివరాలు
మరో రెండు వారాలపాటు కాల్పుల విరమణ?
నడా హమదే మోవాద్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడైందన్నారు.
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య ఘర్షణలు తక్షణమే ముగియాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
యుద్ధ ప్రభావం నా పర్యటనపై ఉండదు
వచ్చే నెలలో చైనా పర్యటనకు వెళ్లనున్న ట్రంప్.. ఇరాన్ యుద్ధ ప్రభావం తన పర్యటనపై ఉండదని స్పష్టం చేశారు.
చైనాకు చమురు అవసరం ఉన్నప్పటికీ తమకు లేదని పేర్కొన్నారు.
ఇరాన్‌కు ఆయుధాలు అందించవద్దని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. అందుకు అనుకూల సమాధానం వచ్చినట్లు వెల్లడించారు.
వివరాలు
ఆ విషయం పోప్‌కు చెప్పండి
వాటికన్ అధిపతి పోప్ లియో XIVపై ట్రంప్ మరోసారి విమర్శలు చేశారు.
ఇరాన్‌లో నిరసనకారులపై జరిగిన హింసను ప్రపంచం గమనించాలని అన్నారు.
ఈ విషయాన్ని పోప్‌కు తెలియజేయాలని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా పోప్ మాత్రం ప్రపంచానికి శాంతి, సామరస్యం అత్యవసరమని అన్నారు.
ఆఫ్రికా పర్యటనలో భాగంగా ముస్లింలు, క్రైస్తవులు భిన్న విశ్వాసాలున్నప్పటికీ శాంతియుతంగా జీవిస్తున్నారని చెప్పారు.
ప్రపంచం ఈ సందేశాన్ని గ్రహించాలని సూచించారు.