White House: వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు..
ఈ వార్తాకథనం ఏంటి
శ్వేతసౌధం పరిసర ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్‌లో జరుగుతున్నశ్వేతసౌధ ప్రతినిధుల విందు కార్యక్రమంలో ఓ దుండగుడు ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనతో అక్కడున్న వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్,రక్షణ శాఖ మంత్రి పీట్ హెక్సెత్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియోలను భద్రతా సిబ్బంది అక్కడి నుంచి తరలించారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. కాల్పులు ప్రారంభమైన వెంటనే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది,ఇతర భద్రతా బలగాలు బ్యాంకెట్ హాల్‌లోకి ప్రవేశించడంతో అక్కడున్న వందలాది మంది అతిథులు తీవ్ర భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు.
వివరాలు
మేమంతా సురక్షితంగా ఉన్నాం
ఐదు నుంచి ఎనిమిది సార్లు కాల్పుల శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఘటన అనంతరం హాల్ బయట భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ భద్రతా సిబ్బందిని ప్రశంసించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అత్యంత వేగంగా, ధైర్యంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వెంటనే తనతో పాటు మెలానియా, జేడీ వాన్స్, మంత్రివర్గ సభ్యులందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు. తామంతా ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ఉన్నామని స్పష్టం చేశారు.