LOADING...
Iran: ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్.. 'ఇక మీ అంతు చూస్తాం' అంటూ ఏఐ చిత్రాలతో వార్నింగ్‌!
'ఇక మీ అంతు చూస్తాం' అంటూ ఏఐ చిత్రాలతో వార్నింగ్‌!

Iran: ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్.. 'ఇక మీ అంతు చూస్తాం' అంటూ ఏఐ చిత్రాలతో వార్నింగ్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల వేదికగా మరింత దూకుడుగా స్పందించారు. తన 'ట్రూత్ సోషల్' వేదికలో ఇరాన్‌ను హెచ్చరిస్తూ వరుసగా కృత్రిమమేధతో రూపొందించిన చిత్రాలు,దృశ్యాలను పంచుకున్నారు. ఈ పోస్టులు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులను మరింత వేడెక్కించాయి. కొద్దిగంటల వ్యవధిలోనే ట్రంప్ ఇరవైకి పైగా చిత్రాలను పంచుకోవడం చర్చనీయాంశమైంది. వాటిలో ఎక్కువ భాగం ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను సూచించేలా కనిపించాయి. ఒకచిత్రంలో ఇరాన్ పటంపై అమెరికా జెండాను కప్పి, చుట్టూ దాడి సూచించే బాణాలను చూపించారు. మరో చిత్రంలో ఇరాన్‌కు చెందిన వేగవంతమైన పడవలపై అమెరికా డ్రోన్లు దాడి చేస్తున్నట్లుగా చూపిస్తూ "బై బై, ఫాస్ట్ బోట్స్" అని పేర్కొన్నారు.

వివరాలు 

పోస్టులకు ముందు ట్రంప్ ఇరాన్‌కు ఘాటైన హెచ్చరిక

అంతేకాకుండా, తాను కంప్యూటర్ ముందు కూర్చొని టేబుల్‌పై చేయి కొడుతూ క్షిపణి దాడులకు ఆదేశాలు ఇస్తున్నట్లుగా రూపొందించిన దృశ్యాన్ని కూడా ట్రంప్ పంచుకున్నారు. మరో కొన్ని చిత్రాల్లో అంతరిక్ష నౌకలో కూర్చొని దాడులను పర్యవేక్షిస్తున్నట్లు, 'హత బటన్' నొక్కుతున్నట్లు చూపించారు. ఈ పోస్టులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పోస్టులకు ముందు ట్రంప్ ఇరాన్‌కు ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. "ఇరాన్‌కు సమయం వేగంగా ముగిసిపోతోంది. వెంటనే శాంతి ఒప్పందానికి రాకపోతే వారి ఉనికే ప్రమాదంలో పడుతుంది. సమయం అత్యంత కీలకం" అని తన ఖాతాలో పేర్కొన్నారు.

వివరాలు 

యుద్ధాన్ని ఆపేందుకు ఫలించని వాషింగ్టన్ ప్రయత్నాలు

గత ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు ప్రారంభించిన తరువాత ఇరు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో అస్థిరత పెరిగినప్పటికీ యుద్ధాన్ని ఆపేందుకు వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ యుద్ధ ప్రభావంతో కీలకమైన హార్ముజ్ జలసంధి దిగ్బంధన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఇరవై శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయి.

Advertisement

వివరాలు 

సామాజిక మాధ్యమాల ద్వారా ఒత్తిడి పెంచే ప్రయత్నం

ఇదిలా ఉండగా, ఇరాన్ మాత్రం లెబనాన్‌లో శాశ్వత కాల్పుల విరమణ జరిగే వరకు ట్రంప్‌తో ఎలాంటి శాంతి ఒప్పందం కుదుర్చుకోబోమని స్పష్టం చేసింది. తమ షరతులను టెహ్రాన్ అంగీకరించకపోవడంతో ట్రంప్ అసహనానికి గురవుతున్నారని, అందుకే సామాజిక మాధ్యమాల ద్వారా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement