Trump: హర్మూజ్‌పై రేపు తెల్లవారుజాముతో ముగియనున్న ట్రంప్ గడువు.. యుద్ధం ఏ మలుపు తీసుకునేనో..
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటలే మిగిలి ఉండడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉత్కంఠగా మారాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకు) ఈ గడువు ముగియనుంది. అప్పటివరకు హర్మూజ్‌ను తెరవకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై భారీ దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. గతంలో డెడ్‌లైన్‌లు పొడిగించిన ఆయన, ఈసారి మాత్రం ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. అవసరమైతే ఒక్కరాత్రిలోనే ఇరాన్‌ను పూర్తిగా దెబ్బతీయగలమని, ఆ రాత్రి మంగళవారమే కావచ్చని హెచ్చరించారు.
వివరాలు
45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన
ఇదిలా ఉండగా పరిస్థితులు తీవ్రతరం కావడంతో ఈజిప్టు,పాకిస్థాన్, తుర్కియే దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవి 45రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినా, ఇరాన్ దాన్ని తిరస్కరించింది. తాత్కాలిక విరమణ కాదు,యుద్ధానికి శాశ్వత ముగింపు కావాలనే తమ వైఖరిని వెల్లడించింది. మరోవైపు అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులు కొనసాగించాయి. ఈ దాడుల్లో 26మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐఆర్‌జీసీ నిఘా విభాగాధిపతి మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ కూడా ఉండటం ఇరాన్‌కు పెద్ద దెబ్బగా మారింది. అలాగే ఇరాన్‌కు కీలక ఆదాయ వనరైన సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రాన్ని కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది.
వివరాలు
చర్చలకు సమయం దక్కేలా..
హర్మూజ్ గడువు సమీపించడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్‌లకు ఈజిప్టు, పాకిస్థాన్, తుర్కియే దేశాలు కీలక ప్రతిపాదనను అందించాయి. ఇందులో 45 రోజుల కాల్పుల విరమణతో పాటు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం ప్రధాన అంశాలు. ఈ విరమణ కాలంలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరపాలని సూచించాయి. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌తో పాటు ఇతర కీలక నేతలతో ఫోన్‌లో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
వివరాలు
అంగీకరించని ఇరాన్
మధ్యవర్తుల ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక కాల్పుల విరమణ కంటే యుద్ధానికి పూర్తిస్థాయి ముగింపు కావాలని స్పష్టం చేసింది. తమపై మళ్లీ దాడులు జరగవని హామీ ఇవ్వాలని కోరింది. ఈ విషయాన్ని కైరోలోని ఇరాన్ దౌత్య కార్యాలయం వెల్లడించింది. అలాగే హర్మూజ్ జలసంధిలో రాకపోకల నియంత్రణ కోసం ఒమన్‌తో కలిసి ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపింది.
వివరాలు
టెహ్రాన్‌పై బాంబుల వర్షం
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు భారీగా దాడులు జరిపాయి. నగరంలోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిసరాలు కూడా దెబ్బతిన్నాయి. ఎల్లామ్‌షర్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో కనీసం 15 మంది మృతి చెందగా, కోమ్ నగరంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర ప్రాంతాల్లో మరో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం టెహ్రాన్‌లోని పలు విమానాశ్రయాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇరాన్‌కు చెందిన హెలికాప్టర్లు, ఒక విమానం ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ మరణించినట్లు ఇరాన్ సైన్యం ధృవీకరించింది. దీనిపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందిస్తూ ఇరాన్ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుంటూనే ఉంటామని తెలిపారు.
వివరాలు
కీలక గ్యాస్ క్షేత్రంపై దాడి
ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు క్షేత్రంగా గుర్తింపు పొందిన సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ఐఆర్‌జీసీ కమాండర్లు మరణించారు. ఈ క్షేత్రాన్ని ఖతార్‌తో కలిసి ఇరాన్ పంచుకుంటోంది. గతంలో కూడా ఈ ప్రాంతంపై దాడులు జరగగా, అప్పట్లో ట్రంప్ స్పందించి ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేయదని హామీ ఇచ్చారు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంలో జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. అలాగే కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలపై కూడా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది.
వివరాలు
కాళరాత్రి మంగళవారం రాత్రే కావొచ్చు: ట్రంప్
లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయిన్ సాదెహ్ ప్రాంతంలో జరిగిన దాడిలో అపార్ట్‌మెంట్ కూలిపోగా, రాజకీయ నాయకుడు పియెర్రె మౌవాద్, ఆయన భార్యతో పాటు మరో మహిళ మరణించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 109 డాలర్లకు చేరుకుంది. యుద్ధం ప్రారంభంతో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం పెరుగుదల. గత 37 రోజుల్లో ఇరాన్‌లో 13 వేలకుపైగా లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా బలగాలు ఒక్కరాత్రిలోనే ఇరాన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయగలవని ఆయన పేర్కొన్నారు. ఆ కీలక రాత్రి మంగళవారం కావచ్చని మరోసారి హెచ్చరించారు. ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయిన అమెరికా పైలట్లను రక్షించిన ఆపరేషన్ చరిత్రాత్మకమని తెలిపారు.
వివరాలు
కాళరాత్రి మంగళవారం రాత్రే కావొచ్చు: ట్రంప్
రెండో పైలట్ రక్షణ కోసం 155 విమానాలు పాల్గొన్నాయని, అందులో 64 యుద్ధవిమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమాచారం బయటకు రావడంతో తమ ఆపరేషన్ కష్టతరమైందని పేర్కొన్నారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా స్పందిస్తూ, ఇరాన్‌పై ఇప్పటివరకు చేయనంత భారీ దాడులు జరగనున్నాయని హెచ్చరించారు.