Donald Trump: ట్రంప్ కల్లోలం.. దేశంలో రూ.9.86 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ఐరోపా దేశాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గ్రీన్‌లాండ్ అంశంలో తమకు వ్యతిరేకంగా నిలుస్తున్న దేశాలను లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో తానే తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు, ఐరోపా నేతలతో జరిగిన గోప్య సంభాషణలను కూడా బహిర్గతం చేస్తూ దౌత్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తున్నారు. ఫ్రాన్స్‌పై ఏకంగా 200 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
దేశంలో రూ.9.86 లక్షల కోట్ల సంపద ఆవిరి
చాగోస్ ద్వీపాలను మారిషస్‌కు అప్పగించాలని బ్రిటన్ గతేడాది తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ పరిణామాలపై ఐరోపా దేశాలు కూడా వెనక్కి తగ్గకుండా స్పందిస్తున్నాయి. అవసరమైతే ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించాయి. ఈయూ-అమెరికా మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశముందని స్పష్టం చేశాయి. ఇదే సమయంలో జీ7 దేశాల అత్యవసర భేటీకి సిద్ధమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దౌత్య ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కూడా పడింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలగా, భారత్‌లోని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు రూ.9.86 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది.
వివరాలు
చాగోస్‌పై ట్రంప్ యూటర్న్
చాగోస్ ద్వీపాలను మారిషస్‌కు అప్పగించే అంశంపై గతంలో సానుకూలంగా స్పందించిన ట్రంప్ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మాట్లాడుతున్నారు. హిందూ మహాసముద్రంలో ఉన్న డీగో గార్షియా ద్వీపం అమెరికా నేవీ, బాంబర్లకు అత్యంత కీలక స్థావరమని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాన్ని కారణం లేకుండా మారిషస్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రణాళిక వేయడం తెలివితక్కువ చర్యగా వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని చైనా, రష్యా అమెరికా బలహీనతగా భావిస్తాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కీలకమైన భూభాగాన్ని వదిలేయడం వల్లే గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని ఆయన వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.
వివరాలు
బ్రిటన్‌కు షాక్
గ్రీన్‌లాండ్ విషయంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు ట్రంప్ వ్యాఖ్యలు ఊహించని షాక్‌గా మారాయి. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానని ట్రంప్ ప్రకటించడం సరికాదని, అయితే చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం సాధిస్తామని స్టార్మర్ స్పష్టం చేశారు. మరోవైపు, చాగోస్‌ను మారిషస్‌కు అప్పగించినా డీగో గార్షియాలోని అమెరికా సైనిక స్థావరం మరో వందేళ్లపాటు కొనసాగుతుందని బ్రిటన్ మంత్రి డారెన్ జోన్స్ వెల్లడించారు.
వివరాలు
ఏఐ చిత్రాలతో సంచలనం
ట్రంప్ తాజాగా రెండు ఏఐ జనరేటెడ్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక చిత్రంలో ఐరోపా నేతలతో కలిసి గ్రీన్‌లాండ్ అంశంపై చర్చిస్తున్నట్లు చూపించారు. అ మెరికా, కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్ మ్యాప్‌లపై అమెరికా జెండాలు ముద్రించినట్లుగా కనిపించాయి. మరో చిత్రంలో గ్రీన్‌లాండ్ మంచుకొండల మధ్య అమెరికా జెండాతో ట్రంప్ నిలబడి ఉండగా, వెనుక ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో కనిపించారు. ఈ చిత్రానికి 'గ్రీన్‌లాండ్ అమెరికా భూభాగం - 2026' అనే క్యాప్షన్ కూడా జతచేశారు.
వివరాలు
ఫ్రాన్స్‌పై సుంకాల బెదిరింపు
గ్రీన్‌లాండ్‌కు గట్టి మద్దతు ఇస్తున్న ఫ్రాన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ సుంకాల దాడికి దిగారు. ఫ్రాన్స్ వైన్, షాంపేన్‌లపై 200 శాతం సుంకాలు విధిస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తనకు పంపిన వ్యక్తిగత సందేశాన్ని కూడా బయటపెట్టారు. గాజా అభివృద్ధి బోర్డులో చేరతానని మెక్రాన్ చెప్పినప్పటికీ, అది అవసరం లేదని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వ్యాఖ్యానించారు. కాగా, గాజా బోర్డులో చేరబోమని మెక్రాన్ ఇప్పటికే ప్రకటించారు.
వివరాలు
ప్రైవేటు సందేశాల వెల్లడి
గ్రీన్‌లాండ్ అంశంపై ఐరోపా నేతలు పంపిన ప్రైవేటు సందేశాలను ట్రంప్ వరుసగా బయటపెడుతున్నారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా ఐరోపా నేతలతో భేటీ ఉంటుందని ఆయన తెలిపారు. అమెరికా జాతీయ భద్రత, ప్రపంచ భద్రత కోసమే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని తేల్చి చెప్పారు. మెక్రాన్ పంపిన సందేశంలో సిరియా, ఇరాన్ అంశాల్లో స్పష్టత ఉన్నా, గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ వైఖరి అర్థం కావడం లేదని పేర్కొన్నట్లు ట్రంప్ వెల్లడించారు.
వివరాలు
ప్రైవేటు సందేశాల వెల్లడి
జీ7 దేశాల నేతలతో పాటు ఉక్రెయిన్, డెన్మార్క్, సిరియా, రష్యా ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తానని మెక్రాన్ తెలిపారు. గురువారం ట్రంప్‌ను విందుకు తీసుకెళ్తానని కూడా చెప్పారు. నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూట్ పంపిన సందేశాన్ని కూడా ట్రంప్ బహిర్గతం చేశారు. గ్రీన్‌లాండ్‌కు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉన్నానని, త్వరలో కలుసుకోవాలని రూట్ పేర్కొన్నట్లు తెలిపారు. నోబెల్ అవార్డు తనకు ముఖ్యం కాదని, అది నార్వే ప్రభుత్వం ఇచ్చే బహుమతి మాత్రమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వివరాలు
ముప్పేట దాడికి ఈయూ సిద్ధం
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఐరోపా కూటమి మూడంచెల వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రతీకార సుంకాలు, ఈయూ-అమెరికా వాణిజ్య ఒప్పందం నిలిపివేత, అమెరికా సంస్థలు,వ్యక్తులపై ఆంక్షలు విధించే అంశాలపై చర్చలు సాగుతున్నాయి. గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌కు ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ గట్టి మద్దతు ప్రకటించారు. ఆయా దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై ఎలాంటి రాజీ ఉండబోదని దావోస్‌లో స్పష్టం చేశారు.
వివరాలు
ముప్పేట దాడికి ఈయూ సిద్ధం
ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు ఐరోపా కట్టుబడి ఉందన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన అదనపు సుంకాలు అన్యాయమని వ్యాఖ్యానించారు. డెన్మార్క్ మంత్రి మేరీ జెర్రీ కూడా ట్రంప్ సుంకాల బెదిరింపులను తీవ్రంగా ఖండించారు. గ్రీన్‌లాండ్ అంశంలో ఐరోపా దేశాలు మరింత బలంగా ఏకతాటిపై నిలవాలని కోరారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ సైతం ఐరోపాకు మద్దతు తెలుపుతూ, నేతలు మరింత ధృఢంగా స్పందించాలని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐరోపా స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి.
వివరాలు
బంధం బలంగానే ఉందన్న అమెరికా
ఒకవైపు ఉద్రిక్తతలు కొనసాగుతున్నా, అమెరికా-ఐరోపా సంబంధాలు ఇంకా బలంగానే ఉన్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్ నేపథ్యంలో ట్రంప్ చేసిన సుంకాల హెచ్చరికలు చివరకు అమలుకాకుండా తేలిపోవాలని ఆశిస్తున్నట్లు దావోస్‌లో తెలిపారు.
వివరాలు
గ్రీన్‌లాండ్‌కు ప్రత్యేక యుద్ధ విమానం
గ్రీన్‌లాండ్ చుట్టూ అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ తమ ప్రత్యేక యుద్ధ విమానాన్ని గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌లో మోహరించనున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక రక్షణ వ్యూహంలో భాగంగా ఈ విమానాన్ని అక్కడ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ విమానం త్వరలోనే ఆ స్థావరానికి చేరుకోనుంది.