LOADING...
Donald Trump: 'చాలా కోపంగా ఉన్నా'.. పుతిన్ నివాసం లక్ష్యంగా ఉక్రెయిన్ దాడిపై ట్రంప్ ఆగ్రహం
'చాలా కోపంగా ఉన్నా'..పుతిన్ నివాసం లక్ష్యంగా ఉక్రెయిన్ దాడిపై ట్రంప్ ఆగ్రహం

Donald Trump: 'చాలా కోపంగా ఉన్నా'.. పుతిన్ నివాసం లక్ష్యంగా ఉక్రెయిన్ దాడిపై ట్రంప్ ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధ సమయంలో దాడులు జరగడం సహజమేనని పేర్కొన్న ఆయన,అయితే నేరుగా ఒక దేశాధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలకు ఇది సరైన సమయం కాదని కూడా వ్యాఖ్యానించారు. అమెరికా ఫ్లోరిడాలో ఉన్న మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సమావేశమయ్యారు. ఈభేటీకి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేసిందన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. తన నివాసంపై దాడి జరిగిందని పుతిన్ స్వయంగా ఫోన్ చేసి తనకు తెలిపినట్లు ట్రంప్ వెల్లడించారు.

వివరాలు 

పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి: సెర్గీ లావ్రోవ్

ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం అని, ఈ అంశంపై తాను చాలా ఆగ్రహంగా ఉన్నానని చెప్పారు. అయితే అదే సమయంలో ఈ దాడిపై అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. నిజంగా అటువంటి దాడి జరిగిందో లేదో తెలియదని, ఈ విషయంపై తనకు పూర్తిస్థాయి నమ్మకం లేదని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. మాస్కో సమీపంలోని నోవ్గోరోడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ నెల 28, 29 తేదీల్లో ఉక్రెయిన్ మొత్తం 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను ప్రయోగించిందని ఆయన తెలిపారు.

వివరాలు 

పుతిన్ నివాసంపై ఎలాంటి దాడి చేయలేదు: ఉక్రెయిన్ 

అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని వెల్లడించారు. ఈ ఘటనను దేశంపై జరిగిన ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు తగిన ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే ప్రతీకార దాడుల కోసం రష్యా సైన్యం లక్ష్యాలను ఖరారు చేసిందని కూడా చెప్పారు. అయితే రష్యా చేసిన ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. పుతిన్ నివాసంపై తాము ఎలాంటి దాడి చేయలేదని స్పష్టం చేస్తూ, రష్యా వాదనల్లో వాస్తవం లేదని ఉక్రెయిన్ ప్రకటించింది.

Advertisement