Trump: ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనాకు ట్రంప్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వచ్చిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. టెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని చైనాకు సూచించారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరచి చమురు నౌకల రాకపోకలు సజావుగా సాగేందుకు సీమైన్స్‌ను తొలగించడానికి అమెరికా దళాలు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు. ఇరాన్‌తో చర్చలు విఫలమైనప్పటికీ తుది విజయం తమదేనని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. సైనికంగా ఇరాన్‌ను బలహీనపరిచామని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో నాటో నుంచి అమెరికాకు ఎలాంటి మద్దతు లభించలేదని కూడా తెలిపారు.
వివరాలు
గుర్తించిన అమెరికా నిఘా వర్గాలు
ఇదిలా ఉండగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలోనే, గత దాడుల్లో దెబ్బతిన్న తమ రక్షణ వ్యవస్థలను పునర్నిర్మించేందుకు టెహ్రాన్ వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో చైనా నుంచి ఇరాన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భుజంపై మోసుకుని ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లు, ఇతర క్షిపణి వ్యవస్థలను బీజింగ్ టెహ్రాన్‌కు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఆయుధాలను ఉపయోగించి అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని సమాచారం.
వివరాలు
ఆరోపణలను ఖండించిన చైనా రాయబార కార్యాలయం
వచ్చే వారం రోజుల్లో ఈ సరఫరాలు టెహ్రాన్‌కు చేరే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. తన పాత్ర బయటపడకుండా ఉండేందుకు చైనా ఈ ఆయుధాలను ఇతర దేశాల మార్గంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఏ పక్షానికీ తాము ఆయుధాలు సరఫరా చేయలేదని స్పష్టం చేసింది. మరోవైపు, చైనా నుంచి ఆయుధాలు అందిన విషయాన్ని ఇరాన్ బహిరంగంగా ప్రకటించకపోయినా, అమెరికా విమానాలను కూల్చడంలో ఆధునిక రక్షణ వ్యవస్థలే కీలక పాత్ర పోషించాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది.