Trump: ఇరాన్‌కు గడువు పొడిగింపు.. ట్రంప్ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఇచ్చిన గడువును మరోసారి పొడిగించారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు (ఈస్ట్రన్ టైమ్ ప్రకారం) ఇరాన్‌కు సమయం ఇస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా సోమవారం నాటికి ఒప్పందం కుదరాలని ట్రంప్ స్పష్టం చేసినప్పటికీ, తాజా పరిణామాల దృష్ట్యా మరో రోజు గడువు పెంచారు. ఇరాన్ నుంచి అనుకూల స్పందన వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ట్రంప్ ఇచ్చిన అదనపు సమయాన్ని ఇరాన్ సద్వినియోగం చేసుకుంటుందా?
ఇంతకుముందు ఇరాన్ 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్'ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఈ కీలక సముద్ర మార్గం అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో ముఖ్యమని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వేచ్ఛగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. గడువు పొడిగింపు ద్వారా చర్చల ద్వారా సమస్య పరిష్కారం సాధ్యమనే సంకేతాలను ట్రంప్ ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన అదనపు సమయాన్ని ఇరాన్ సద్వినియోగం చేసుకుంటుందా? లేదా పశ్చిమాసియాలో మరో దీర్ఘకాల ఉద్రిక్తతలకు దారి తీస్తుందా? అన్నది మంగళవారం రాత్రి స్పష్టతకు రానుంది. తాజా పరిణామాలపై ప్రపంచ దేశాలు వాషింగ్టన్-టెహ్రాన్ వైపు ఆశగా,ఆందోళనగా చూస్తోంది.