LOADING...
Turkey: తీరు మార్చుకొని తుర్కియే అధ్యక్షుడు.. భారత్‌పై మరోసారి కవ్వింపు
తీరు మార్చుకొని తుర్కియే అధ్యక్షుడు.. భారత్‌పై మరోసారి కవ్వింపు

Turkey: తీరు మార్చుకొని తుర్కియే అధ్యక్షుడు.. భారత్‌పై మరోసారి కవ్వింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

తుర్కియే అధ్యక్షుడు రెసిప్‌ తయ్యప్‌ ఎర్డోగాన్‌ మళ్లీ భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఆయన ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్-పాక్‌ల మధ్య కొనసాగుతున్న కశ్మీర్‌ వివాదాన్ని మరోసారి ప్రస్తావించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడుతూ, ఆ ఉద్రిక్తతలు ఘర్షణకు దారితీశాయని ఎర్డోగాన్‌ పేర్కొన్నారు. అనంతరం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందుకు తాము సంతోషిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో భారత్-పాక్ సహకారం అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో కశ్మీర్‌ సమస్యను ఐరాస భద్రతా మండలి తీర్మానాల ప్రకారం పరిష్కరించాలని తాను కోరుతున్నట్లు వెల్లడించారు.

Details

కశ్మీర్ అంశాన్ని నిరంతరం ప్రస్తావిస్తూనే ఉన్నారు

కశ్మీర్ ప్రజలకు చర్చల ద్వారానే మేలు జరగాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌ అంతర్గత విషయం అని భారత్‌ పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, ఎర్డోగాన్‌ తన వైఖరిని మార్చడం లేదు. కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలోనూ అనేకసార్లు ఇదే విషయంపై మాట్లాడారు. ముఖ్యంగా 2019 నుండి ప్రతి ఏడాది ఐరాస వేదికపై కశ్మీర్‌ సమస్యను నిరంతరం ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో భేటీ అయినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ సమయంలో భారత్‌ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇక గాజా సమస్యపై కూడా ఎర్డోగాన్‌ ఘాటుగా స్పందించారు.

Details

అమాయకులపై మరణహోమం సృష్టిస్తోంది

టెల్‌అవీవ్‌ అమాయకులపై మారణహోమం సృష్టిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు మిగిలిన దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గడచిన 23 నెలలుగా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయని, గాజాలో ప్రతి గంటకు ఒక బిడ్డ ప్రాణాలు కోల్పోతుందనే భయానక పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. దీనికి ఇక ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు.