Loading...
Saudi Arabia Death Penalty: ఇద్దరు బంగ్లాదేశ్‌ పౌరులకు సౌదీలో ఉరిశిక్ష.. అసలేం జరిగింది?
ఇద్దరు బంగ్లాదేశ్‌ పౌరులకు సౌదీలో ఉరిశిక్ష.. అసలేం జరిగింది?

Saudi Arabia Death Penalty: ఇద్దరు బంగ్లాదేశ్‌ పౌరులకు సౌదీలో ఉరిశిక్ష.. అసలేం జరిగింది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాలో ఇద్దరు బంగ్లాదేశ్‌ పౌరులకు మరణశిక్ష అమలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితి అక్తర్‌ అనే ఇద్దరిని అక్టోబర్‌ 14న ఉరితీసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని ముందుగా తమకు తెలియజేయలేదని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పేర్కొంది. మరణశిక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, న్యాయస్థానం తీర్పుల ప్రతులు, వారు చేసినట్లు ఆరోపిస్తున్న నేరాల వివరాలు ఇవ్వాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ వ్యవహారంపై రియాద్‌ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో బంగ్లాదేశ్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మసీదులో అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో వారిద్దరికి మరణశిక్ష విధించినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.

వివరాలు

అధికారిక ప్రకటన వెలువడలేదు

అయితే, ఏ మసీదులో ఈ ఘటన జరిగిందో, అసలు ఏం జరిగిందో అధికారిక ప్రకటనలో వివరించలేదు. మక్కాలోని పవిత్ర స్థలంలో వారిద్దరూ ముద్దు పెట్టుకున్నారనే వార్తలు కొన్ని మీడియా సంస్థల్లో వచ్చాయి.

మరికొందరు సోషల్‌ మీడియాలో నుదుటిపై ముద్దు పెట్టుకున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ వివరాలకు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.

బంగ్లాదేశ్‌, సౌదీ అరేబియా మధ్య మతపరమైన, ఆర్థిక, కార్మిక సంబంధాలు బలంగా ఉన్నాయి.

అలాంటి రెండు దేశాల మధ్య ఈ ఘటన దౌత్యపరమైన వివాదానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది.

సౌదీ అరేబియా ప్రభుత్వ వార్తా సంస్థ సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ(SPA)విడుదల చేసిన ప్రకటనలో నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్‌, సితి అక్తర్‌ అనే పేర్లను ప్రస్తావించింది. వీరిద్దరూ బంగ్లాదేశ్‌కు చెందినవారేనని తెలిపింది.

వివరాలు

ఎవరు ఆ ఇద్దరు బంగ్లాదేశ్‌ పౌరులు?

బంగ్లాదేశ్‌ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో కథనం ప్రకారం.. 25 ఏళ్ల నజ్రుల్ బ్రహ్మన్‌బారియా సదర్‌ ఉపజిల్లాలోని ఓ గ్రామానికి చెందినవాడు.

సుమారు నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. మక్కాలోని మస్జిద్ అల్‌ హరమ్‌లో నిర్వహణ సిబ్బందిలో పనిచేసినట్లు ఆ కథనం పేర్కొంది.

సితి అక్తర్‌ టాంగైల్‌ జిల్లాలోని మిర్జాపూర్‌ ఉపజిల్లా, మహేరా యూనియన్‌ పరిధిలోని నగర్‌ ఛావాలి గ్రామానికి చెందినవారు. నజ్రుల్‌, సితి భార్యాభర్తలని కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నప్పటికీ.. వారిద్దరూ దంపతులా? కలిసి ఉన్నారా? అనే విషయాలు అధికారికంగా నిర్ధారణ కాలేదు.

నజ్రుల్‌ కుటుంబ సభ్యులు మాత్రం అతడికి వివాహం కాలేదని, సితి గురించి తమకు ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నట్లు ప్రోథోమ్ అలో తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు

మసీదులో అనుచిత ప్రవర్తన చేశారనే ఆరోపణలు

సౌదీ అధికారుల ప్రకారం.. పవిత్ర నగరంలోని ఓ మసీదులో అనుచితంగా ప్రవర్తించినందుకు నజ్రుల్‌, సితిలను అరెస్టు చేసి మరణశిక్ష విధించారు.

అయితే ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. వారు ఎప్పుడు అరెస్టయ్యారు? ఏ మసీదులో ఈ ఘటన జరిగింది? అనే అంశాలపై కూడా అధికారిక ప్రకటనలో స్పష్టత లేదు.

వారికి ఇస్లామిక్‌ న్యాయవ్యవస్థలోని 'తాజిర్‌' విధానం కింద మరణశిక్ష విధించినట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది.

ఈ విధానంలో నేరం స్వభావం, విధించే శిక్షకు సంబంధించిన నిర్ణయంలో న్యాయమూర్తికి విచక్షణాధికారం ఉంటుంది.

మక్కాలోని మసీదులో వారిద్దరూ ముద్దు పెట్టుకున్నారనే ఆరోపణలు కొన్ని వార్తా కథనాల్లో వచ్చాయి.

అయితే ముద్దు పెట్టుకోవడమే ఘటనకు కారణమని అధికారికంగా నిర్ధారించే పూర్తి వివరాలు అందుబాటులో లేవు.

ADVERTISEMENT

వివరాలు

కుట్ర జరిగిందంటున్న నజ్రుల్‌ కుటుంబం

సౌదీ ప్రభుత్వం వారిద్దరూ అనైతిక చర్యలకు పాల్పడ్డారని పేర్కొంటుండగా.. నజ్రుల్‌ కుటుంబ సభ్యులు మాత్రం అతడిపై కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ప్రోథోమ్ అలో కథనం ప్రకారం.. సౌదీ అరేబియా వెళ్లిన ఎనిమిది నెలలకే నజ్రుల్‌ను అరెస్టు చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.

అప్పటి నుంచి అతడు జైలులోనే ఉన్నాడని, అరెస్టయిన విషయం తమకు నెల రోజుల తర్వాత తెలిసిందని పేర్కొన్నారు.

నజ్రుల్‌ అప్పుడప్పుడు తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడేవాడని, ఆ సంభాషణలు కొన్ని నిమిషాలకే పరిమితమయ్యేవని కుటుంబ సభ్యులు చెప్పారు.

అక్టోబర్‌ 11న వారిద్దరి మధ్య చివరిసారిగా ఫోన్‌ సంభాషణ జరిగింది. అది సుమారు రెండున్నర నిమిషాల పాటు కొనసాగింది.

వివరాలు

మరణశిక్ష అమలు

ఆ తర్వాత గత బుధవారం బంగ్లాదేశ్‌ కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల సమయంలో సౌదీ అరేబియా నుంచి ఓ వ్యక్తి నజ్రుల్‌ కుటుంబానికి ఫోన్‌ చేసి, అతడికి మరణశిక్ష అమలు చేసినట్లు సమాచారం ఇచ్చాడు.

నజ్రుల్‌ బంధువులైన మోస్తాకిమ్‌ భుయాన్‌, ఇమామ్‌ హసన్‌ భుయాన్‌ ప్రోథోమ్ అలోతో మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలో క్లీనర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తితో నజ్రుల్‌కు వివాదం ఏర్పడిందని చెప్పారు.

ఈవిషయాన్ని అతడు తన మేనమామ, మేనత్తకు ఫోన్‌లో వివరించాడని తెలిపారు. ఆ వివాదంలో ఉన్న వ్యక్తి పాకిస్థాన్‌కు చెందినవాడని నజ్రుల్‌ చెప్పినట్లు వారు పేర్కొన్నారు.

ఆవ్యక్తి చేసినట్లు అనుమానిస్తున్న కుట్ర కారణంగానే నజ్రుల్‌కు ఈ పరిస్థితి ఎదురై ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

వివరాలు

సితి కుటుంబం ఏమంటోంది?

సితి అక్తర్‌ కుటుంబ సభ్యులు కూడా ఆమె అరెస్టు వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.

ఆమెకు మరణశిక్ష అమలు చేసినట్లు అధికారికంగా నిర్ధారణ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, కుటుంబ సభ్యులు మాట్లాడారు.

సౌదీ అరేబియాలో ఇతర మహిళా కార్మికులతో వాగ్వాదం జరిగిన తర్వాత, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ప్రస్తుతం నజ్రుల్‌, సితి కుటుంబాలు తమవారి మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నాయి.

అసలు ఏం జరిగిందో వెల్లడించాలని, తమ పౌరులను రక్షించడంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఎందుకు విఫలమైందో సమాధానం చెప్పాలని వారు కోరుతున్నారు.

వివరాలు

సౌదీని వివరణ కోరిన బంగ్లాదేశ్

ఇద్దరు పౌరులకు మరణశిక్ష అమలు చేసిన విషయం మీడియా కథనాల ద్వారానే తమకు తెలిసిందని బంగ్లాదేశ్‌ అధికారులు పేర్కొన్నారు.

సాధారణంగా ఇద్దరు బంగ్లాదేశ్‌ పౌరులను అరెస్టు చేసి, ఇంత తక్కువ వ్యవధిలో మరణశిక్ష అమలు చేయడం అసాధారణమని బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖకు చెందిన కొందరు అధికారులు అభిప్రాయపడినట్లు ప్రోథోమ్ అలో నివేదించింది.

పూర్తి వివరాలను ఇవ్వాలని ఢాకా ప్రభుత్వం సౌదీ అరేబియాను కోరింది. న్యాయస్థానం తీర్పుల ప్రతులు, నేరాలకు సంబంధించిన వివరాలు, తమ దౌత్య కార్యాలయానికి ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదనే అంశాలపై వివరణ కోరింది.

బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షమా ఒబైద్‌ ఇస్లాం మాట్లాడుతూ.. ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందనే విషయాన్ని మా దౌత్య కార్యాలయానికి తెలియజేయలేదు.

ADVERTISEMENT