American Airlines: రన్‌వేపై రెండు బోయింగ్ విమానాలు ఢీ.. విరిగిపడిన రెక్క భాగం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ఉన్న రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు బోయింగ్ 737 విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. శుక్రవారం సాయంత్రం 5:10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. డల్లాస్ వెళ్లాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 638, చికాగోకు వెళ్లాల్సిన ఫ్లైట్ 2152 రన్‌వే 19 వద్ద టేకాఫ్ కోసం వరుసలో ఉన్నాయి. ఈ క్రమంలో ట్యాక్సీయింగ్ చేస్తుండగా రెండు విమానాల రెక్కల చివరి భాగాలు ఒకదానికొకటి తగిలాయి. ఈ ఘటనలో ఓ విమానం రెక్కకు అమర్చిన వింగ్‌లెట్ విరిగి ట్యాక్సీవేపై పడిపోయింది.
వివరాలు
మరమ్మతుల కోసం విమానాలు సర్వీసు నుంచి తొలగింపు
వెంటనే పైలట్లు ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు తెలియజేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు రెండు విమానాలను తిరిగి గేట్ల వద్దకు తీసుకెళ్లారు. మెట్రోపాలిటన్ వాషింగ్టన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి చెందిన ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది విమానాలను తనిఖీ చేశారు.
అనంతరం మరమ్మతుల కోసం రెండు విమానాలనూ సర్వీసు నుంచి తొలగించినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ ఘటన కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి సంస్థ క్షమాపణలు తెలిపింది.
వారిని ఇతర విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. థ్యాంక్స్‌గివింగ్ పండుగ సందర్భంగా విమాన ప్రయాణాల రద్దీ కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తునకు ఆదేశించింది.