Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై క్షిపణిదాడి.. ఒక భారతీయుడు మృతి, ఇద్దరికి గాయాలు
గతేడాది అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యద్ధం కారణంగా వేలాంది మంది మరణించారు. తాజాగా ఇజ్రాయెల్‌పై జరిగిన క్షిపణి దాడిలో ఒక భారతీయుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. లెబనాన్ నుంచి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ క్షిపణి ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు ప్రాంతమైన మార్గలియట్ సమీపంలోని తోటలో పడిపోయింది. దీంతో కేరళకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కాగా మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం 11గంటలకు జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లెబనాన్‌లోని షియా హిజ్బుల్లా వర్గం ఈ దాడికి పాల్పడింది. హమాస్‌కు మద్దతుగా ఈ బృందం ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగిస్తోంది.
గాయపడిన వారు క్షేమంగా..
క్షిపణి దాడిలో మరణించిన వ్యక్తి పేరు పట్నీబిన్ మాక్స్‌వెల్. అతను కేరళలోని కొల్లం నివాసి. జీవా ఆసుపత్రిలో మృతదేహాన్ని గుర్తించారు. గాయపడిన వారిలో బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్ ఉన్నారని అధికారులు తెలిపారు. ముఖం, శరీరంపై గాయాలతో జార్జ్‌ను పెటా టిక్వాలోని బెలిన్సన్ ఆసుపత్రికి తరలించారు. అతనికి ఆపరేషన్ చేశారు. జార్జ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. అతనిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. జార్జ్ భారతదేశంలోని తన కుటుంబంతో కూడా మాట్లాడారు. మెల్విన్ కూడా స్వల్ప గాయాలతో ఉత్తర ఇజ్రాయెల్ నగరమైన సఫేద్‌లోని జివ్ ఆసుపత్రిలో చేరాడు. అతను కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందినవాడు.