రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు
గ్రీస్‌లోని టెంపేలో కార్గో రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 26 మంది మరణించారు. ఈ ప్రమాదంలో దాదాపు కనీసం 85 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. మంగళవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. రెండు రైళ్లు ఢీకొనడంతో పలు కోచ్‌లు పట్టాలు తప్పాయని, మూడు కోచ్‌లు దగ్ధమయ్యాయని ప్రముఖ వార్తా సంస్థ అసోసియేట్ ప్రెస్ నివేదించింది. రెండు రైళ్లు బలంగా ఢీకొన్నాయని థెస్సాలీ ప్రాంత గవర్నర్ కాన్స్టాంటినోస్ అగోరాస్టోస్ వెల్లడించారు. ప్యాసింజర్ రైలులోని మొదటి నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయని, అందులో రెండు కోచ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడించారు.
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన సమయలంలో ప్యాసింజర్ రైలులో దాదాపు 350మంది ప్రయాణికులు ఉన్నట్లు అగోరాస్టోస్ తెలిపారు. అందులో 250మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు అగోరాస్టోస్ వెల్లడించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు అగ్నిమాపక సేవా ప్రతినిధి పేర్కొన్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో హెడ్‌ల్యాంప్‌లను ధరించిన శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. శిథిలాలను తొలగించేందుకు క్రేన్‌లను తెప్పించామని, సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని సంప్రదించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువ జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు.