
Typhoon Ragasa: తైవాన్, చైనాలో రాగస తుఫాన్ దాడి.. 17 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రాగస తుపాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లలో ఉధృతంగా విరుచుకుపడింది. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు గంటకు 200 కి.మీ. వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలు చెల్లా చెదురుగా మారిపోయాయి. ఈ తుఫాన్ వల్ల తైవాన్‌లో 14 మంది, ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితులకు పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక వసతులు కల్పించారు. హాంకాంగ్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అనేక పాఠశాలలు మూతబడ్డాయి, విమాన సర్వీసులు రద్దయ్యాయి. దుకాణాలు మూసివేయడంతో నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయింది. సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇటీవల కాలంలో రాగస తుఫాన్ అత్యంత శక్తివంతమైన తుఫాన్‌లలో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు.
Details
గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స
బుధవారం తెల్లవారుజామున హాంకాంగ్ విహార ప్రదేశాల వద్ద దీపస్తంభాల కంటే ఎత్తైన అలలు ఎగిసిపడగా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లో కూడా విధ్వంసం మిగిల్చింది. బుధవారం ఉదయం నుంచి హాంకాంగ్‌లో తీవ్ర గాలులు వీచి ప్రజలను బెంబేలెత్తించాయి. అనేక చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, చెట్లు కూలిపోయాయి. గాయపడిన పలువురికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో దక్షిణ చైనాలోని ఆర్థిక శక్తి కేంద్రమైన గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో పది లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు రాష్ట్ర ప్రసార సంస్థ ప్రకటించింది.
Details
గంటకు 195 కి.మీ వేగంతో గాలులు
జాతీయ వాతావరణ సంస్థ అంచనా ప్రకారం, బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య తైషాన్, ఝాంజియాంగ్ నగరాల మధ్య తుఫాన్ తీరం దాటనుంది. హాంకాంగ్ అబ్జర్వేటరీ వివరాల ప్రకారం, రాగస తుఫాన్ ప్రస్తుతం గంటకు 195 కి.మీ (120 మైళ్ళు) వేగంతో గాలులు వీచిస్తోంది. అలాగే గంటకు 22 కి.మీ (సుమారు 14 మైళ్ళు) వేగంతో పశ్చిమం లేదా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందని అంచనా వేస్తున్నారు.