Philippines Typhoon: ఫిలిప్పీన్స్‌లో విరుచుకుపడ్డ ఘోర తుఫాన్: 241 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అత్యంత శక్తి సంపన్నమైన కల్మేగి తుఫాన్ ఫిలిప్పీన్స్‌ను ధ్వంసం చేసింది. బుధవారం ఈ తుఫాన్ తీవ్రమైన విధ్వంసం సృష్టించగా, ఇప్పటివరకు 241 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడగా, వేలాది కుటుంబాలు నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. ఈ విపత్తుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. గురువారం దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఆకస్మిక వరదలు, అలలు, ప్రళయ ప్రవాహాలు కారణంగా చాలా మంది కొట్టుకుపోయారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రక్షణ మరియు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాలు
నిరాశ్రయులైన 5.6 లక్షల మంది గ్రామస్తులు
తుఫాన్ ప్రభావానికి మొత్తం 2 మిలియన్లకు పైగా ప్రజలు నష్టపోయారు. అందులో 5.6 లక్షల మంది గ్రామస్తులు నిరాశ్రయులయ్యారు. అదేవిధంగా 4.5 లక్షల మందిని ప్రభుత్వ అత్యవసర శిబిరాలకు తరలించారని పౌర రక్షణ విభాగం వెల్లడించింది. సహాయక పనుల కోసం బయల్దేరిన ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు సైనికులు మరణించారు. అయితే ఆ ప్రమాదానికి గల నిజమైన కారణాలు ఇంకా వెల్లడించలేదు. కల్మేగి కారణంగా భీకర వరదలు నమోదయ్యాయి. సెబు ప్రావిన్స్‌లో నదులు, జలమార్గాలు ఉప్పొంగి నగర, గ్రామ ప్రాంతాలపై దూసుకెళ్లాయి.
వివరాలు
ఊహించని రీతిలో ఆకస్మిక వరదలు
అనేక ఇళ్లు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు భవనాల పైకప్పులపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు. సెబులో మాత్రమే 71 మంది మరణించగా, నీటిలో కొట్టుకుపోడం వలన మరో 65 మంది కనిపించకుండా పోయారు. అలాగే 69 మంది గాయపడ్డారని సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. సెబుకు సమీపంలో ఉన్న నీగ్రోస్ ఆక్సిడెంటల్ సెంట్రల్ ప్రావిన్స్‌లో మరో 62 మంది అదృశ్యమయ్యారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన సెబు గవర్నర్ పమేలా బారికువాట్రో, "మేము సాధ్యమైనంత వరకూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ ఊహించని రీతిలో ఆకస్మిక వరదలు సంభవించాయని తెలిపారు.