Loading...
U.S. federal court: అమెరికాలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ వీసా ప్రతిపాదనకు కోర్టు బ్రేక్
ట్రంప్ వీసా ప్రతిపాదనకు కోర్టు బ్రేక్

U.S. federal court: అమెరికాలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ వీసా ప్రతిపాదనకు కోర్టు బ్రేక్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ విద్యార్థులు, విదేశీ జర్నలిస్టుల వీసాల కాలపరిమితిని తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో భారతీయ విద్యార్థులతో పాటు అమెరికాలో చదువుకుంటున్న లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఊరట కలిగింది.

వివరాలు 

అసలు ఏమిటీ వీసా వివాదం?

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) గతంలో విదేశీ విద్యార్థులు,పరిశోధకులు, జర్నలిస్టుల వీసా నిబంధనలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో గరిష్ఠంగా నాలుగేళ్లు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉండేది.

ఆ గడువు పూర్తయిన తర్వాత కూడా దేశంలో కొనసాగాలంటే ప్రత్యేకంగా ఫెడరల్ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.

అంతేకాకుండా విదేశీ జర్నలిస్టుల వీసా గడువును కూడా భారీగా తగ్గించాలని డీహెచ్‌ఎస్ సూచించింది.

ప్రస్తుతం చాలా సంవత్సరాల పాటు ఉండే అవకాశం ఉన్న జర్నలిస్టుల వీసా కాలపరిమితిని 240 రోజులకు కుదించాలని ప్రతిపాదించింది.

చైనా జర్నలిస్టుల విషయంలో ఈ గడువును కేవలం 90 రోజులకే పరిమితం చేయాలని పేర్కొంది.

వివరాలు 

డీహెచ్‌ఎస్ నిర్ణయం చట్టవిరుద్ధం: కోర్టు

మరోవైపు, చదువు పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులకు లభించే గ్రేస్ పీరియడ్‌ను కూడా 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించింది.

డీహెచ్‌ఎస్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను బోస్టన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ కొట్టివేశారు.

ఈ నిర్ణయం ఏకపక్షంగా, విచక్షణారహితంగా ఉందని పేర్కొన్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తన తీర్పులో స్పష్టం చేశారు.

విదేశీ విద్యార్థులకు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించాలన్న కాంగ్రెస్ ఉద్దేశాన్ని డీహెచ్‌ఎస్ నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఎఫ్‌-1 విద్యార్థి వీసా కార్యక్రమాన్ని బలహీనపరిచే స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు డీహెచ్‌ఎస్‌కు చట్టం విస్తృత అధికారాలను కల్పించలేదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

తీర్పుపై విద్యా, భారతీయ సంఘాల హర్షం

దీంతో వీసా నిబంధనలను కఠినతరం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయపరంగా అడ్డుకట్ట పడింది.

ఫెడరల్ కోర్టు తీర్పుపై భారతీయ, విద్యా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) అధ్యక్షుడు ఖండేరావు కండ్ స్పందించారు.

అంతర్జాతీయ విద్యార్థులకు న్యాయస్థానం మరోసారి అండగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ తీర్పు ద్వారా అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, పరిశోధన రంగాల భవిష్యత్తుకు కూడా రక్షణ లభించిందని అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

వివరాలు 

తీర్పుపై విద్యా, భారతీయ సంఘాల హర్షం

ఈ కేసులో ప్రధాన పిటిషనర్‌గా ఉన్న ప్రెసిడెంట్స్ అలయన్స్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అధ్యక్షురాలు మిరియం ఫెల్డ్‌బ్లమ్ కూడా తీర్పును స్వాగతించారు.

ఇది అంతర్జాతీయ విద్యార్థులతో పాటు అమెరికా విశ్వవిద్యాలయాలకు లభించిన స్పష్టమైన విజయమని పేర్కొన్నారు.

ఇలాంటి కఠినమైన, హానికరమైన విధానాల కారణంగానే అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలు గణనీయంగా తగ్గిపోయాయని గుర్తుచేశారు.

మరోవైపు, సుదీర్ఘకాలంగా అమల్లో ఉన్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానం కొనసాగుతుందని ఈ తీర్పుతో స్పష్టమైందని నాఫ్సా (NAFSA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాంటా ఆ తెలిపారు.

మొత్తంగా ఈ తీర్పు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు గణనీయమైన ఊరటనిచ్చింది.

ADVERTISEMENT