LOADING...
UAE: నెతన్యాహు యూఏఈ పర్యటన వార్తలు అవాస్తవం.. స్పష్టంచేసిన ఎమిరేట్స్
నెతన్యాహు యూఏఈ పర్యటన వార్తలు అవాస్తవం.. స్పష్టంచేసిన ఎమిరేట్స్

UAE: నెతన్యాహు యూఏఈ పర్యటన వార్తలు అవాస్తవం.. స్పష్టంచేసిన ఎమిరేట్స్

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రహస్యంగా యూఏఈలో పర్యటించారనే వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. అయితే ఆ ప్రచారాన్ని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ పూర్తిగా ఖండించింది. నెతన్యాహు తమ దేశానికి రాలేదని, అలాంటి పర్యటన ఏదీ జరగలేదని స్పష్టంచేసింది. అంతేకాకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఎలాంటి సైనిక ప్రతినిధి బృందం కూడా యూఏఈలో అడుగుపెట్టలేదని ఎమిరేట్స్ ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో తమ సంబంధాలు పూర్తిగా బహిరంగంగానే కొనసాగుతున్నాయని తెలిపింది. అబ్రహం ఒప్పందాల పరిధిలోనే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

వివరాలు 

అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి

ఈ వ్యవహారంలో రహస్య సమావేశాలు, గోప్య చర్చలు జరిగాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని యూఏఈ అధికారిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. యూఏఈ ప్రభుత్వ అధికారికప్రకటన లేకుండా వచ్చే ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచించింది. ఇదిలా ఉండగా నెతన్యాహు యూఏఈ పర్యటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆపర్యటనలో నెతన్యాహు యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారని పేర్కొంది. ఈభేటీతో ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడినట్లు వెల్లడించింది. అయితే యూఏఈ మాత్రం అలాంటి పర్యటన అసలు జరగలేదని స్పష్టంగా చెబుతోంది. దీంతో ఇజ్రాయెల్‌ ప్రకటన,యూఏఈ వివరణల మధ్య విభిన్న వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Advertisement