LOADING...
UAE: యూఏఈలో ప్రధాని మోదీకి ప్రత్యేక స్వాగతం.. యుద్ధ విమానాలతో ఎస్కార్ట్

UAE: యూఏఈలో ప్రధాని మోదీకి ప్రత్యేక స్వాగతం.. యుద్ధ విమానాలతో ఎస్కార్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు భద్రతా వలయంగా వెంట వచ్చాయి. ముఖ్యంగా యూఏఈ వాయుసేన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎఫ్‌-16 బ్లాక్‌ 60 'డెజర్ట్ ఫాల్కన్‌' యుద్ధ విమానాన్ని పంపించడం విశేషంగా మారింది. అబుదాబిలో ప్రధాని విమానం దిగే వరకు ఆ యుద్ధ విమానం ఎస్కార్ట్‌గా కొనసాగింది. ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా మధ్యలో మోదీ యూఏఈకి చేరుకున్నారు. అక్కడ ఆయన కేవలం కొన్ని గంటలపాటు మాత్రమే ఉండనున్నారు.

వివరాలు 

యూఏఈపై ఇరాన్‌ చేసిన దాడిని ఖండించిన ప్రధాని 

అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ స్థాయిలో ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంగా యూఏఈపై ఇరాన్‌ చేసిన దాడిని ప్రధాని మోదీ ఖండించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోందని పేర్కొన్నారు. హర్మూజ్‌ జలసంధి విషయంలో అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని సూచించారు. మోదీ సమక్షంలో భారత్‌, యూఏఈ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. వంటగ్యాస్ సరఫరా, పెట్రోలియం నిల్వలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అదేవిధంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా భారత అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Advertisement