UK: యూకేలో శాశ్వత నివాసానికి 10 ఏళ్లు.. నిబంధనలు కఠినతరం
ఈ వార్తాకథనం ఏంటి
యూకేలో శాశ్వత నివాసం పొందాలని ఆశించే వలసదారులకు ఇక ముందు మరింత కఠినమైన నిబంధనలు ఎదురుకానున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశ హోంశాఖ మంత్రి షబానా మహమూద్ సూచనప్రాయంగా వెల్లడించారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం,శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న ఐదేళ్ల నివాస గడువును పది సంవత్సరాలకు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక వర్గాల కింద ఉన్న వలసదారులు శాశ్వత నివాస హక్కు పొందడానికి ఇరవై సంవత్సరాల వరకు వేచి ఉండాల్సి వచ్చే అవకాశముంది. ఇక అర్హత నిబంధనల విషయంలో కూడా కఠినతరం చేయాలని నిర్ణయించారు. దరఖాస్తుదారులకు ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అలాగే ఆంగ్ల భాషపై ఉన్నత స్థాయి ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి.
వివరాలు
నైపుణ్య ఉద్యోగులకు యూకే నివాసంలో సడలింపులు
గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కనీస ఆదాయ ప్రమాణం మేరకు సంపాదన ఉండాలని నిబంధనలు సూచిస్తున్నాయి. ఈ మార్పులు అమల్లోకి వస్తే, పూర్తి కాల ఉపాధి అవకాశాలు లేని వారు, ఆశ్రయం కోరినవారు, కుటుంబ ఆధారిత అనుమతులపై ఉన్నవారు, అలాగే ఉద్యోగ అనుమతులపై ఆధారపడినవారిపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పది సంవత్సరాల ప్రాథమిక గడువులో కొంత మార్పు ఉండొచ్చని సమాచారం. ముఖ్యంగా జాతీయ ఆరోగ్య సేవల్లో పనిచేసే నర్సులు, వైద్యులు, అలాగే అధిక నైపుణ్యం కలిగి నిర్దిష్ట ఆదాయానికి మించి సంపాదిస్తున్నవారు మూడు లేదా ఐదు సంవత్సరాల తరువాతే శాశ్వత నివాసానికి అర్హత పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.