LOADING...
UK: బ్రిటన్‌ ప్రధానిపై సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు.. ఆరోగ్య మంత్రి రాజీనామా
బ్రిటన్‌ ప్రధానిపై సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు.. ఆరోగ్య మంత్రి రాజీనామా

UK: బ్రిటన్‌ ప్రధానిపై సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు.. ఆరోగ్య మంత్రి రాజీనామా

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌కు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయన్ను పదవి నుంచి తప్పించేందుకు లేబర్‌ పార్టీలో అంతర్గతంగా ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే పలువురు ఉప మంత్రులు పదవులకు రాజీనామా చేయగా, తాజాగా కేబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రి వెస్‌ స్ట్రీటింగ్‌ కూడా వైదొలిగారు. స్టార్మర్‌ నాయకత్వానికి బహిరంగంగా వ్యతిరేకత తెలిపిన తొలి సీనియర్‌ మంత్రి స్ట్రీటింగ్‌ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన రాజీనామా లేఖలో స్ట్రీటింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై స్టార్మర్‌ ధైర్యంగా వ్యవహరించారని, ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధంలో బ్రిటన్‌ నేరుగా జోక్యం చేసుకోకుండా నిలువరించడంలో ఆయన పాత్ర ముఖ్యమని ప్రశంసించారు.

వివరాలు 

ప్రధాని రేసులో..  మాజీ ఉప ప్రధానమంత్రి అంజెలా రేనార్

అయితే దేశానికి అవసరమైన స్పష్టమైన దూరదృష్టి, సమర్థ నాయకత్వ దిశ ప్రస్తుతం కనిపించడం లేదని విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీని విజయవంతంగా నడిపించే సామర్థ్యం స్టార్మర్‌కు లేదనే అభిప్రాయంతోనే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఎప్పటి నుంచో ప్రధాని పదవిపై ఆసక్తి కనబరుస్తున్న వెస్‌ స్ట్రీటింగ్‌.. భవిష్యత్తులో స్టార్మర్‌ నాయకత్వాన్ని నేరుగా సవాల్‌ చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఉప ప్రధానమంత్రి అంజెలా రేనార్‌ కూడా ప్రధాని రేసులో ఉంటానని ప్రకటించారు. పన్ను ఎగవేత ఆరోపణలతో గతంలో రాజీనామా చేసిన ఆమె ప్రస్తుతం ఆ ఆరోపణల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే వెస్‌ స్ట్రీటింగ్‌తోనూ పోటీకి సిద్ధమేనని స్పష్టం చేశారు.

వివరాలు 

స్టార్మర్‌పై ఒత్తిడి

ఇక గ్రేటర్‌ మాంచెస్టర్‌ మేయర్‌ ఆండీ బర్న్‌హమ్‌ పేరు కూడా ప్రధానమంత్రి అభ్యర్థుల జాబితాలో వినిపిస్తోంది. అయితే ఆయన ముందుగా పార్లమెంట్‌కు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అందుకోసం ఒక ఎంపీ రాజీనామా చేస్తే ఉప ఎన్నిక నిర్వహించి ఆండీ బర్న్‌హమ్‌ను కామన్స్‌ సభకు పంపే అవకాశం ఉందని లేబర్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. గత వారం జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార లేబర్‌ పార్టీ నిరాశాజనక ఫలితాలు నమోదు చేసినప్పటి నుంచి స్టార్మర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. అయినప్పటికీ తాను పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్టార్మర్‌ గురువారం మరోసారి స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

403 మంది సభ్యుల్లో కనీసం 81 మంది మద్దతు

లేబర్‌ పార్టీ నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి పదవికి పోటీ చేయాలనుకునే నేతకు కామన్స్‌ సభలోని 403 మంది సభ్యుల్లో కనీసం 81 మంది మద్దతు అవసరం. గతంలో కన్జర్వేటివ్‌ పార్టీలో ప్రధానులను పదవి నుంచి తప్పించిన ఘటనలు ఉన్నప్పటికీ, లేబర్‌ పార్టీలో అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా కనిపిస్తాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో 400కుపైగా ఎంపీలతో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే స్టార్మర్‌ పదవి ప్రమాదంలో పడటం బ్రిటన్‌ రాజకీయాల్లో పెద్ద పరిణామంగా మారిందని విశ్లేషిస్తున్నారు.

Advertisement