Ukraine: రష్యాతో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఒకే.. ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు
ఈ వార్తాకథనం ఏంటి
మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు కీవ్ అంగీకరించింది.
అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరించగా, రష్యాతో తక్షణమే చర్చలు జరపాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఇరుపక్షాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇటీవల వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మధ్య జరిగిన చర్చల్లో వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సమావేశం అనంతరం జెలెన్‌స్కీ అర్ధాంతరంగా అమెరికా నుంచి వెనుదిరిగారు.
వివరాలు
అమెరికా, ఉక్రెయిన్ చర్చలు
దీనివల్ల ఉక్రెయిన్‌లో ఖనిజాల తవ్వకాల ఒప్పందం నిలిచిపోయింది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చల సందర్భంలో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
దీంతో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో సానుకూల వాతావరణంలో అమెరికా, ఉక్రెయిన్ చర్చలు జరిగాయి.
ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణను అంగీకరించగా,సైనిక సహాయం,నిఘా భాగస్వామ్యానికి సంబంధించి కీవ్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
అంతేకాకుండా, ఖనిజ తవ్వకాల ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ చర్చల వివరాలను రష్యాకు తెలియజేస్తామని అమెరికా తెలిపింది.
వివరాలు
ఉక్రెయిన్ రష్యాపై వందలాది డ్రోన్లతో దాడి
ఉక్రెయిన్‌తో చర్చల్లో అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రూబియో,జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ పాల్గొన్నారు.
చర్చల అనంతరం మార్కో రూబియో మాట్లాడుతూ,ఉక్రెయిన్‌తో జరిగిన చర్చల వివరాలను రష్యాకు తెలియజేస్తామని అన్నారు.
కాల్పుల విరమణకు కీవ్ అంగీకరించిందని, తక్షణమే శాంతి చర్చలు జరగాలని కోరుకుందని వెల్లడించారు.రష్యా కూడా శాంతికి అంగీకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఒకవేళ వారు అంగీకరించకపోతే శాంతికి అడ్డంకి ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది"అని అన్నారు. అయితే,ఉక్రెయిన్ అధ్యక్షుడు సౌదీకి వెళ్లినప్పటికీ ఈ చర్చల్లో పాల్గొనలేదు.
ఇదిలా ఉండగా,సౌదీలో అమెరికాతో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్ రష్యాపై వందలాది డ్రోన్లతో దాడి చేసింది.
ముఖ్యంగా మాస్కో, కుర్స్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న ఈదాడిలో 337డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలిటరీ ప్రకటించింది.