Russia-Ukraine: మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. నిలిచిన విమాన సర్వీసులు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాపై ఉక్రెయిన్ మరోసారి భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు తెగబడింది. వందలాది డ్రోన్లతో మాస్కోతో పాటు పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడంతో రష్యా రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా మాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు మాస్కో, దాని శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా అధికారులు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో రాజధాని నగరం అంతటా భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, కీలక ప్రాంతాల్లో అప్రమత్త చర్యలు చేపట్టారు. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీ సమీపంలో డ్రోన్ దాడులు జరగడంతో భారీ మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ఆ ప్రాంతంలోని రహదారులపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
వివరాలు
ప్రధాన విమానాశ్రయాల్లో తాత్కాలిక ఆంక్షలు అమలు
జోకోవ్‌స్కీ జిల్లాలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంతో పాటు మాస్కో శివార్లలో ఉన్న ఓ షాపింగ్ మాల్ సమీపంలో కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగిందా లేదా అనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. దాడులు కొనసాగుతున్న సమయంలో మాస్కోలో అత్యంత రద్దీగా ఉండే షెరెమెట్యేవో విమానాశ్రయంలో ప్రయాణికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదే సమయంలో విమాన కార్యకలాపాలను పరిమితం చేసి, అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో తాత్కాలిక ఆంక్షలు అమలు చేశారు.
వివరాలు
రెండేళ్లలో మాస్కోపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే..
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ నుంచి తమ దేశంపైకి దూసుకొచ్చిన 500కుపైగా డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థల సాయంతో కూల్చివేసినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. వీటిలో మాస్కోను లక్ష్యంగా చేసుకుని వచ్చిన 180కుపైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది. గత రెండేళ్లలో మాస్కోపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని రష్యా మీడియా పేర్కొంది. మరోవైపు, కజన్ నగరంలో ఆసియన్ నేషనల్ సమ్మిట్ (ASEAN) ప్రారంభం కానున్న కొద్ది గంటల ముందే ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఆసియన్ దేశాల అధినేతలు పాల్గొననున్నారు. కాగా, ఈ దాడులకు సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జెలెన్‌స్కీ చేసిన ట్వీట్
Цієї ночі наші далекобійні санкції знову дійшли до Московського регіону: вдруге за тиждень уражено Московський нафтопереробний завод. Також були уражені цілі в Ростовському регіоні та на тимчасово окупованих територіях України. Цілком справедлива відповідь на російські удари по…
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 18, 2026