UN Global Hunger Crisis: 10మందిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారు: ఐరాస ఫుడ్ చీఫ్
ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెక్‌కెయిన్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల మందికి పైగా ప్రజలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, వారు ఎప్పుడు తింటారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార డిమాండ్ నిరంతరం పెరుగుతోందని ఆమె వివరించారు. నిధుల కొరత కారణంగా ఏజెన్సీ లక్షలాది మందికి ఆహార రేషన్‌లను తగ్గించవలసి వచ్చిందని యూఎన్ భద్రతా మండలికి ఆమె చెప్పారు. త్వరలో మరింత మందికి ఆహారాన్ని తగ్గించనున్నట్లు వెల్లడించారు. రోమ్ ఏజెన్సీతో 79దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చీఫ్ తెలిపారు.
కరువు అంచున 47మిలియన్ల మంది ప్రజలు
సర్వే ప్రకారం 783మిలియన్ల మంది ప్రజలు అంటే, ప్రపంచ జనాభాలో 10మందిలో ఒకరు ఇప్పటికీ ప్రతి రాత్రి ఆకలితో పడుకుంటున్నారు. ఈ ఏడాది అధిక స్థాయిలో 345మిలియన్లకు పైగా ప్రజలు ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నట్లు సర్వే వెల్లడించింది. 50కంటే ఎక్కువ దేశాల్లో 47మిలియన్ల మంది వ్యక్తులు కరువు అంచున ఉన్నారని ఫుడ్ ఏజెన్సీ అంచనా వేసింది. 45మిలియన్ల మంది ఐదేళ్ల లోపు పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటారని చెప్పింది. ఆకలి, పేదరికాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక అవసరాలను తగ్గించడానికి తమ సంస్థకు సహాయపడే బహుళ-రంగాల భాగస్వామ్యా పెంచుకోవడం సవాలుగా మారిందని మెక్‌కెయిన్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అవసరమైన వారికి సహాయం చేయడానికి వినూత్న పరిష్కారాలను కనుగొనడం ద్వారా మాత్రమే సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని వెల్లడించారు.