LOADING...
US-Iran Talks: అమెరికా-ఇరాన్‌ రెండో విడత చర్చలపై సందిగ్ధత
అమెరికా-ఇరాన్‌ రెండో విడత చర్చలపై సందిగ్ధత

US-Iran Talks: అమెరికా-ఇరాన్‌ రెండో విడత చర్చలపై సందిగ్ధత

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2026
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా మంగళవారం ఈ సమావేశాలు జరుగుతాయో లేదో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనగా, అలాంటి ప్రణాళికలేమీ లేవని ఇరాన్‌ తెలిపి ఆశ్చర్యపరిచింది. హర్మూజ్‌ సమీపంలో టెహ్రాన్‌కు చెందిన నౌకపై అమెరికా దాడి చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. పాకిస్థాన్‌ మాత్రం చర్చలు జరుగుతాయనే నమ్మకంతో ముందస్తు ఏర్పాట్లు చేసింది. అమెరికా, ఇరాన్‌ ప్రతినిధుల రాక కోసం భద్రతను కట్టుదిట్టం చేసింది. చర్చల అవకాశాలను ఇరాన్‌ పూర్తిగా తోసిపుచ్చకపోవడం కొంత ఊరటనిస్తోంది. అయితే కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనుండగా,దాన్ని పొడిగించే అవకాశం లేదని ట్రంప్‌ హెచ్చరించారు.

వివరాలు 

ఇజ్రాయెల్‌ కారణంగానే యుద్ధం మొదలైందన్న ఆరోపణలను ఖండించిన ట్రంప్ 

శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్‌తో చర్చల కోసం తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం పాక్‌కు బయలుదేరుతుందని ట్రంప్‌ తెలిపినా, వారు ఇంకా చేరుకోలేదు. వారి వివరాలను వెల్లడించేందుకు అమెరికా అధికారులు నిరాకరించారు. ఇదిలా ఉండగా, పాక్‌ సైన్యాధిపతి అసీం మునీర్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఓడరేవుల దిగ్బంధనంపై ఆగ్రహంతోనే ఇరాన్‌ చర్చల విషయంలో ఆలస్యం చేస్తోందని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ కారణంగానే యుద్ధం మొదలైందన్న ఆరోపణలను ట్రంప్‌ ఖండించారు. ఇరాన్‌పై యుద్ధానికి దిగాలని ఇజ్రాయెల్ ఎప్పుడూ కోరలేదని తెలిపారు. అక్టోబర్‌ 7, 2023 ఘటనల తర్వాత ఇరాన్‌కు అణ్వస్త్రాలు దక్కకుండా చూడాలని తన నిర్ణయం మరింత బలపడిందని చెప్పారు.

వివరాలు 

'తౌస్కా'నౌక అమెరికా స్వాధీనం

ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ,తదుపరి చర్చల్లో పాల్గొనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇదే సమయంలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడారు. అమెరికాతో చర్చలు కొనసాగించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్,ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కూడా ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో ప్రయాణిస్తున్న'తౌస్కా'నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు ట్రంప్‌ తెలిపారు. హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో చర్య తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. దీనిపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించి,కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిందని ఆరోపించింది. ప్రతీకార చర్యల హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్‌ విప్లవగార్డు దళం డ్రోన్లతో అమెరికా యుద్ధనౌకలను వెనక్కు నెట్టినట్లు వార్తలు వచ్చాయి.

Advertisement

వివరాలు 

ఇరాన్‌ అంతర్గత పరిస్థితులపై కూడా సందేహాలు

అమెరికా చర్యలపై ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహ్మద్ రెజా ఆరిఫ్ తీవ్రంగా స్పందించారు. తమ చమురు ఎగుమతులు ఆగిపోయినప్పుడు ఇతర దేశాలు భద్రత కోరడం సరికాదన్నారు. ఇరాన్‌ అంతర్గత పరిస్థితులపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీ గాయపడటంతో కీలక నిర్ణయాలు ఐఆర్‌జీసీ నేతలు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మేజర్‌ జనరల్‌ అహ్మద్ వహీద్ ప్రభావం పెరిగిందని పేర్కొంటున్నారు.

Advertisement

వివరాలు 

భారత నౌకలపై కాల్పుల ఘటనపై ఇరాన్‌ దర్యాప్తు

ప్రస్తుత ఘర్షణల్లో ఇప్పటివరకు 3,375 మంది మరణించినట్లు ఇరాన్‌ వెల్లడించింది. లెబనాన్‌లో జరిగిన ఘటనపై బెంజమిన్ నెతన్యాహు స్పందించి ఖండించారు. హర్మూజ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారత నౌకాదళం సూచనలు జారీ చేసింది. లారక్‌ దీవికి దూరంగా ఉండాలని, అనుమతి వచ్చిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలని సూచించింది. భారత నౌకలపై కాల్పుల ఘటనపై ఇరాన్‌ దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement