Singapore: కేబుళ్లు, పైప్‌లైన్ల రక్షణ కోసం అండర్‌వాటర్ డ్రోన్ ప్రాజెక్టు.. ఆకస్ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
సముద్రగర్భ కేబుళ్ల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు తమ రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు అండర్‌వాటర్ డ్రోన్ల అభివృద్ధికి ఆకస్ కూటమి (అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగపూర్‌లో జరుగుతున్న భద్రతా సదస్సు సందర్భంగా మూడు దేశాల రక్షణ మంత్రులు శనివారం కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. మానవరహిత సాంకేతికతతో రూపొందనున్న ఈ అండర్‌వాటర్ వాహనాన్ని వచ్చే ఏడాది నాటికి సిద్ధం చేయాలనే లక్ష్యాన్ని ఆకస్ దేశాలు నిర్దేశించుకున్నాయి. ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని ఇంకా వెల్లడించకపోయినా, బ్రిటన్ తరఫున 201 మిలియన్ డాలర్ల నిధులను కేటాయిస్తున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి జాన్ హీలీ ప్రకటించారు.
వివరాలు
2021లో ఆకస్ కూటమి ఏర్పాటు
ఈ అండర్‌వాటర్ డ్రోన్లు సముద్రగర్భంలో ఉన్న కేబుళ్లు, పైప్‌లైన్లను రక్షించడమే కాకుండా నిఘా నిర్వహించడం, సమాచార సేకరణ చేపట్టడం, అవసరమైతే దాడి చర్యలకు కూడా వినియోగించబడతాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక ప్రభావాన్ని ఎదుర్కోవడం ప్రధాన లక్ష్యంగా ఆకస్ కూటమి 2021లో ఏర్పడింది. తాజా అండర్‌వాటర్ డ్రోన్ ప్రాజెక్టు కూడా ఆ వ్యూహంలో కీలక భాగంగా భావిస్తున్నారు.