LOADING...
China J-35A: అమెరికా, మిత్ర దేశాలకు ఆందోళన.... చైనా 'సైలెంట్ కిల్లర్' ప్రదర్శన
అమెరికా, మిత్ర దేశాలకు ఆందోళన.... చైనా 'సైలెంట్ కిల్లర్' ప్రదర్శన

China J-35A: అమెరికా, మిత్ర దేశాలకు ఆందోళన.... చైనా 'సైలెంట్ కిల్లర్' ప్రదర్శన

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2025
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచానికి సవాల్ విసిరే చైనా ఆధునిక ఆయుధ సంపత్తి శనివారం ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ఒక ప్రత్యేక ఆయుధం ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, 'సైలెంట్ కిల్లర్' అనే పేరు కూడా సంపాదించింది. చైనా తన J-35A స్టెల్త్ ఫైటర్ జెట్‌ను యాంటీ-రేడియేషన్ క్షిపణితో కలిపి చాంగ్‌చున్ ఎయిర్ షోలో మొదటిసారి ప్రదర్శించింది. దీన్ని చైనా తన ఆధునిక ఫైటర్ జెట్లను వైమానిక పోరాటానికి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ మిషన్ల కోసం కూడా సిద్ధం చేస్తోందని చెప్పొచ్చు. ఈ ప్రదర్శన ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో జరిగింది. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(AVIC)అనేక క్షిపణులు, J-35Aస్కేల్ మోడల్‌ను ప్రదర్శించింది. ప్రదర్శించిన ఆయుధాలలోPL-10E, PL-15E, PL-12AE ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, LD-8Aయాంటీ-రేడియేషన్ క్షిపణి ఉన్నాయి.

Details

J-35A ప్రత్యేకత

J-35A, LD-8A క్షిపణిని ఒకేసారి ప్రదర్శించడం ద్వారా, ఈ ఫైటర్ జెట్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వేరియంట్‌ను కలిగి ఉండవచ్చని లేదా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కలిపి మిషన్‌లను నిర్వహించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది చైనా వైమానిక సామర్థ్యాలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. బీజింగ్‌కు చెందిన ఏరోస్పేస్ నాలెడ్జ్ మ్యాగజైన్ ఎడిటర్ వాంగ్ యానన్ మాట్లాడుతూ యాంటీ-రేడియేషన్ క్షిపణులు రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని విద్యుద్యస్కాంత తరంగాలను విడుదల చేస్తాయని చెప్పారు. సాధారణంగా, ఈ క్షిపణులను శక్తివంతమైన సెన్సార్లున్న ఎలక్ట్రానిక్ యుద్ధ విమానాలు ఉపయోగిస్తాయని వివరించారు.

Details

LD-8A క్షిపణి గురించి

LD-8A క్షిపణి PL-15E ఎయిర్-టు-ఎయిర్ క్షిపణికి సమానమైన డిజైన్, పరిమాణం కలిగి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది PL-15 సిరీస్ వేరియంట్ కావచ్చునని భావిస్తున్నారు. చైనా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని, ఈ క్షిపణిని ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు.

Details

భవిష్యత్తులో ప్రభావం

J-35A వంటి ఆధునిక స్టెల్త్ జెట్‌లు, యాంటీ-రేడియేషన్ క్షిపణుల కలయిక ఆసియా-పసిఫిక్ ప్రాంతాలపై ప్రభావం చూపగలవని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా ప్రదర్శించిన ఈ ఆధునిక ఆయుధ సంపత్తిని చూసి అమెరికా, దాని మిత్ర దేశాలకు ఆందోళన కలగవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే చైనా రక్షణాత్మక కార్యకలాపాలకు మాత్రమే కాకుండా దాడి ప్రణాళికలకు కూడా సిద్ధంగా ఉందని ఇది సూచిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.