Hormuz: ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న టెన్షన్.. నౌకలపై అమెరికా కఠిన చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తానని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటన నేపథ్యంలో,ఇరాన్ పోర్టుల వైపు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలను అమెరికా నౌకాదళం అడ్డుకోవడం ప్రారంభించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటల నుంచి ఈ దిగ్బంధనం అమల్లోకి వచ్చినట్లు సమాచారం. దీని కోసం అమెరికా నౌకాదళం భారీ స్థాయిలో బలగాలను మోహరించింది.
వివరాలు
ఇరాన్ హెచ్చరిక..
ఇరాన్ పోర్టుల్లోకి ప్రవేశించే, అలాగే బయటకు వచ్చే అన్ని దేశాల నౌకలను హర్మూజ్ వద్ద నిలిపివేస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
అయితే, ఇరాన్‌కు చెందని ఇతర పోర్టులకు వెళ్లే నౌకలకు పెద్దగా ఆటంకాలు కలిగించబోమని కూడా తెలిపింది.
ఇస్లామాబాద్‌లో ఇరాన్‌తో జరిగిన చర్చలు విఫలమైన తరువాతే అమెరికా ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు, తమ పోర్టులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది.
ఈ పరిణామాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
ట్రంప్ వార్నింగ్..
ఇరాన్‌కు చెందిన 158 నౌకలను అమెరికా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అవి ప్రస్తుతం సముద్రంలో మునిగిపోయాయని ఆయన తెలిపారు. ఇరాన్ వద్ద ఉన్న ఫాస్ట్ అటాక్ షిప్స్‌ను ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోలేదని, వాటిని పెద్ద ముప్పుగా భావించడం లేదని కూడా పేర్కొన్నారు.
అయితే ఆ నౌకలు అమెరికా విధించిన దిగ్బంధనం వైపు వస్తే మాత్రం వెంటనే ధ్వంసం చేస్తామని ఆయన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు.
అలాగే, సముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి ప్రవేశించే మాదక ద్రవ్యాల్లో 98.2 శాతం వరకు ఇప్పటికే అడ్డుకున్నామని చెప్పారు.
డ్రగ్ డీలర్లపై ఎలా కఠిన చర్యలు తీసుకుంటామో, అదే విధానాన్ని ఇరాన్ నౌకల విషయంలో కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు.