LOADING...
Trump: హర్మూజ్ జలసంధి దిగ్బంధం: ఇరాన్‌పై ఒత్తిడి పెంపు… దీర్ఘకాల ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌..!
దీర్ఘకాల ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌..!

Trump: హర్మూజ్ జలసంధి దిగ్బంధం: ఇరాన్‌పై ఒత్తిడి పెంపు… దీర్ఘకాల ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడం వల్ల ఇరాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల మధ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇరాన్‌పై దీర్ఘకాల ముట్టడికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. సమాచారం ప్రకారం, సైనిక దాడులను మళ్లీ ప్రారంభించడం కంటే దిగ్బంధనాన్ని కొనసాగించడం ద్వారానే ఇరాన్‌కు పెద్ద ఆర్థిక దెబ్బ తగులుతుందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే కొనసాగుతున్న దిగ్బంధనాన్ని మరికొన్ని రోజులు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ చర్యల కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ వ్యూహం కొనసాగితే ఇరాన్ దీర్ఘకాలిక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.

వివరాలు 

అమెరికాకు గట్టి హెచ్చరికలు

ఇక మరోవైపు, అమెరికా చర్యలకు ప్రతిగా ఇరాన్ ఎలా స్పందిస్తుందోనన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా మళ్లీ సైనిక చర్యలకు దిగితే పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని పేర్కొంది. ఐఆర్‌జీసీ నౌకాదళానికి చెందిన ఒక ఉన్నత అధికారి ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అమెరికా దురాక్రమణకు పాల్పడితే పశ్చిమాసియా ప్రాంతమంతటా ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న బలగాలు రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. అమెరికాకు చెందిన పెద్ద నౌకలను సముద్రంలోనే ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా, అమెరికాతో యుద్ధ విరమణ జరిగినప్పటికీ యుద్ధ పరిస్థితులు పూర్తిగా ముగియలేదని ఇరాన్ సైన్య ప్రతినిధి అమిర్ అక్రమినియా తెలిపారు.

వివరాలు 

జర్మనీ నాయకుడిపై ట్రంప్ విమర్శలు

హర్మూజ్ జలసంధి తమ సాయుధ దళాల నియంత్రణలోనే ఉందని పేర్కొన్నారు. భూతల దాడుల గురించి శత్రువులు పలుమార్లు హెచ్చరించినా, చివరికి వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. జర్మన్ ఛాన్సలర్ ఫెడ్రిక్‌ మెర్జ్‌(Friedrich Merz)పై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ విషయంలో అమెరికా విధానాలపై, అలాగే ఇటీవల పాకిస్థాన్‌లో జరగాల్సిన దౌత్య చర్చలు విఫలమైన నేపథ్యంలో మెర్జ్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. టెహ్రాన్ అణు కార్యక్రమంపై మెర్జ్ తప్పుగా అర్థం చేసుకున్నారని, తన అభిప్రాయాలను కూడా వక్రీకరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం ప్రమాదకరమని ఆయన స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి ప్రపంచానికి ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.

Advertisement