LOADING...
H-1B visas: హెచ్‌1బీ వీసా ఫీజుపై కీలక తీర్పు.. ట్రంప్‌ నిర్ణయం చట్టవిరుద్ధమన్న యూఎస్‌ కోర్టు
హెచ్‌1బీ వీసా ఫీజుపై కీలక తీర్పు.. ట్రంప్‌ నిర్ణయం చట్టవిరుద్ధమన్న యూఎస్‌ కోర్టు

H-1B visas: హెచ్‌1బీ వీసా ఫీజుపై కీలక తీర్పు.. ట్రంప్‌ నిర్ణయం చట్టవిరుద్ధమన్న యూఎస్‌ కోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2026
08:00 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ వృత్తి నిపుణులకు సంబంధించిన హెచ్‌-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి అమెరికా న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌1బీ వీసా పొందే విదేశీ అభ్యర్థులు తప్పనిసరిగా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలన్న నిబంధనను బోస్టన్‌లోని ఫెడరల్‌ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఈ వ్యవహారంపై సోమవారం తీర్పు వెలువరించిన యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి లియో సొరొకిన్‌.. ఈ ఫీజు సాధారణ రుసుము కాదని, ఒక విధమైన పన్ను అని స్పష్టం చేశారు. అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం లేకుండా ఇలాంటి పన్నును విధించే అధికారం అధ్యక్షుడికి లేదని, అందువల్ల ఈ నిర్ణయం చెల్లదని పేర్కొన్నారు.

వివరాలు 

భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించే అవకాశం 

గత ఏడాది సెప్టెంబరులో ట్రంప్‌ ప్రభుత్వం విదేశాల్లో ఉండి అమెరికా తాత్కాలిక వలస వీసా అయిన హెచ్‌1బీకి ఎంపికైన వారు 1 లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిందేనని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. హెచ్‌1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల ఫీజు చట్టబద్ధం కాదని తేల్చింది. ఇది పెనాల్టీ కాదని, కాంగ్రెస్‌ అనుమతి అవసరమైన పన్ను అని పేర్కొంటూ ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఈ తీర్పుతో హెచ్‌1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించే అవకాశముంది.

Advertisement