
US visa: ఏజెంట్ల మోసాలపై అమెరికా కఠిన చర్యలు.. వేలాది వీసా అపాయింట్‌మెంట్లు రద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించి 2,000 వీసా (US Visa) అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు బుధవారం ప్రకటించింది.
అపాయింట్‌మెంట్ వ్యవస్థలో ఓ భారీ లోపాన్ని గుర్తించినట్లు పేర్కొంటూ, వీటిని పూర్తిగా 'బాట్స్' ద్వారా బుక్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపింది.
ఈ నిర్ణయం వల్ల మోసపూరిత మార్గాల్లో అపాయింట్‌మెంట్లు పొందే ప్రయత్నాలను అడ్డుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Details
మోసాలను అడ్డుకొనే దిశగా చర్యలు
'బాట్స్ ద్వారా బుక్ చేసిన 2,000 వీసా అపాయింట్‌మెంట్లను భారత్‌లోని కాన్సులర్ బృందం రద్దు చేస్తోంది.
తమ షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సర్లకు సహకరించే ప్రసక్తే లేదు.
ఈ అపాయింట్‌మెంట్ల రద్దుతో పాటు, అనుబంధ ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను కూడా సస్పెండ్ చేస్తున్నాం.
మోసాలను అడ్డుకునే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతాయని అమెరికా దౌత్య కార్యాలయం ఎక్స్ (Twitter) పోస్టులో స్పష్టం చేసింది.
Details
ఏజెంట్ల మోసాలు
భారతదేశంలో అమెరికా బిజినెస్, విజిటర్ (B1, B2), స్టూడెంట్ వీసాలకు అపాయింట్‌మెంట్ పొందేందుకు సుదీర్ఘ వేచిచూపు (Waiting Time) ఉంటుంది.
అయితే ఏజెంట్ల ద్వారా ప్రాసెస్ చేస్తే, రూ.30,000 నుంచి రూ.35,000 వరకు చెల్లించి నెల రోజుల్లోనే అపాయింట్‌మెంట్ పొందడం సాధ్యమవుతుంది.
ఈ విధానంలో ఏజెంట్లు ప్రత్యేక బాట్స్‌ను ఉపయోగించి వీసా స్లాట్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు.
ఒక వ్యక్తి తన కుమారుడు అమెరికాలోని విశ్వవిద్యాలయంలో చేరేందుకు స్వయంగా వీసా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించగా అది సాధ్యం కాలేదని, అదే ఏజెంటుకు రూ.30,000 చెల్లించగానే వెంటనే అపాయింట్‌మెంట్ లభించిందని ఓ ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రికకు వెల్లడించాడు.
Details
వీసా వెయిటింగ్ సమయంపై అమెరికా చర్యలు
2023లో B1, B2 వీసా అపాయింట్‌మెంట్లకు 999 రోజుల వేటింగ్ పీరియడ్ నమోదయ్యింది.
దీంతో భారతీయ దరఖాస్తుదారుల కోసం ఫ్రాంక్‌ఫర్ట్, బ్యాంకాక్ వంటి నగరాల్లో వీసా అపాయింట్‌మెంట్లు తెరవాల్సిన పరిస్థితి వచ్చింది.
భారత ప్రభుత్వం ఈ సమస్యను అమెరికా దృష్టికి తీసుకెళ్లిన తర్వాత, అక్కడి అధికారులు వీసా వెయిటింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించారు.
తాజా పరిణామంలో, బాట్స్ ద్వారా అక్రమంగా స్లాట్లను బుక్ చేసే మోసాలను అడ్డుకోవడంపై దృష్టిపెట్టినట్లు స్పష్టమైంది.