LOADING...
USA: చైనాకు చెక్ పెట్టేందుకు భారత్‌తో బంధాన్ని బలోపేతం చేయనున్న అమెరికా
చైనాకు చెక్ పెట్టేందుకు భారత్‌తో బంధాన్ని బలోపేతం చేయనున్న అమెరికా

USA: చైనాకు చెక్ పెట్టేందుకు భారత్‌తో బంధాన్ని బలోపేతం చేయనున్న అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో చైనాతో కొనసాగుతున్న వ్యూహాత్మక పోటీలో పైచేయి సాధించాలంటే భారత్‌తో బలమైన భాగస్వామ్యం తప్పనిసరి అని అమెరికా వార్షిక రక్షణ విధాన బిల్లు స్పష్టం చేసింది. కాంగ్రెషనల్‌ నాయకులు ఆదివారం విడుదల చేసిన 'నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ - 2026'లో, భారత్‌తో డిఫెన్స్‌ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రికి ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం విదేశాంగ శాఖ మంత్రితో సమన్వయం చేసుకుంటూ భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించాలని సూచించారు. అలా చేస్తేనే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు గట్టి ఎదురుదెబ్బ ఇవ్వగలమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు క్వాడ్‌ కూటమి వంటి భాగస్వామ్య వేదికలు కీలకంగా మారతాయని బిల్లు వెల్లడించింది.

వివరాలు 

2008లో భారత్‌-అమెరికా మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందం

అమెరికా విదేశాంగ మంత్రి నేతృత్వంలో యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ సెక్యూరిటీ డైలాగ్‌ వంటి సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని బిల్లు సూచించింది. అలాగే 2008లో భారత్‌-అమెరికా మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందం అమలు పురోగతిని సమీక్షించాలన్న ప్రతిపాదనను చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 180 రోజుల్లోగా సంయుక్త అంచనాలతో కూడిన నివేదికను అమెరికా విదేశాంగ మంత్రి సమర్పించాలని ఆదేశించింది.

వివరాలు 

 నిస్తేజంగా మారిన క్వాడ్‌ కూటమి

ఇదిలా ఉండగా, డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌-అమెరికా సంబంధాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. భారత్‌పై 50 శాతం అదనపు టారిఫ్‌లు విధించడం, ట్రంప్‌ చేసిన వివిధ ప్రకటనలు, హెచ్‌-1బీ వీసాల ఫీజులను పెంచడం వంటి నిర్ణయాలు ఇరుదేశాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ పాలన ప్రారంభమైనప్పటి నుంచి క్వాడ్‌ కూటమి కూడా గతంతో పోలిస్తే నిస్తేజంగా మారింది. అయితే తాజాగా విడుదలైన నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ - 2026 భారత్‌ ప్రాధాన్యతను మరోసారి స్పష్టంగా ప్రస్తావిస్తూ, ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో దేశానికి ఉన్న కీలక స్థానం తప్పనిసరిదని నొక్కి చెప్పింది.

Advertisement