LOADING...
Gautam Adani: గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసులన్నీ క్లోజ్
గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసులన్నీ క్లోజ్

Gautam Adani: గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసులన్నీ క్లోజ్

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన సోదరి కుమారుడు సాగర్ అదానీపై అమెరికాలో నమోదైన కీలక క్రిమినల్ కేసులు పూర్తిగా ముగిశాయి. న్యూయార్క్ న్యాయస్థానంలో కొనసాగుతున్న సెక్యూరిటీల మోసం, సమాచార మోసం కేసులను అమెరికా న్యాయశాఖ శాశ్వతంగా ఉపసంహరించుకుంది. అదానీలపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదని, ఈ వ్యవహారానికి అమెరికాతో ప్రత్యక్ష సంబంధాలు కనిపించలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో అదానీ గ్రూప్‌కు అమెరికాలో ఎదురవుతున్న ప్రధాన చట్టపరమైన సమస్యలకు తెరపడినట్టైంది.

వివరాలు 

మళ్లీ కేసే వేయడానికి వీల్లేకుండా కొట్టివేత

ఈ కేసును న్యాయస్థానం 'విత్ ప్రిజుడీస్' విధానంలో కొట్టివేయడం ప్రత్యేకతగా మారింది. అంటే భవిష్యత్తులో ఇదే అంశంపై కేసును తిరిగి ప్రారంభించే అవకాశం ఉండదు. అమెరికా క్రిమినల్ న్యాయవ్యవస్థలో ఇలాంటి నిర్ణయాలు చాలా అరుదుగా వెలువడుతుంటాయి. ఈ కేసును కొనసాగించడం వల్ల సమయం, వనరులు వృథా అవుతాయని అమెరికా న్యాయశాఖ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది. 2024 చివర్లో నమోదైన ఈ కేసు కారణంగా అదానీ గ్రూప్ అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలకు ఆటంకాలు ఏర్పడిన నేపథ్యంలో తాజా పరిణామం సంస్థకు పెద్ద ఊరటగా మారింది.

వివరాలు 

ఆరోపణల ఆధారంగానే అమెరికాలో విచారణ

భారత్‌లో సౌర విద్యుత్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ రూ.2 వేల కోట్లకుపైగా లంచాలు ఇచ్చిందని, ఆ వివరాలను అమెరికా పెట్టుబడిదారుల నుంచి దాచిందని అప్పట్లో ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఆరోపణల ఆధారంగానే అమెరికాలో విచారణ ప్రారంభమైంది. కేసు పూర్తిగా ముగిసే ముందు అదానీ గ్రూప్ అమెరికా ప్రభుత్వ సంస్థలతో పలు పౌర వివాదాలను పరస్పర ఒప్పందాల ద్వారా పరిష్కరించుకుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టుల సమాచార వెల్లడిపై నెలకొన్న వివాదంలో గౌతమ్ అదానీ 60 లక్షల డాలర్లు, సాగర్ అదానీ 1.2 కోట్ల డాలర్ల జరిమానా చెల్లించేందుకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

Advertisement

వివరాలు 

ఇరాన్ ఆంక్షల వివాదం క్లోజ్ కోసం అమెరికా ట్రెజరీకి 27.5 కోట్ల డాలర్లు

అలాగే ఇరాన్ నుంచి వంటగ్యాస్ దిగుమతుల విషయంలో అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై అదానీ ఎంటర్‌ప్రైజెస్ అమెరికా ఖజానా విభాగానికి 27.5 కోట్ల డాలర్లు చెల్లించి ఆ వివాదాన్ని కూడా ముగించింది. అయితే ఈ అన్ని ఒప్పందాల్లోనూ అదానీ గ్రూప్ తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరించకుండా వివాదాలను ముగించడం గమనార్హం. అదానీ తరఫున వాదించిన ప్రముఖ అమెరికా న్యాయ సంస్థలు ఈ కేసుకు అమెరికా పరిధి వర్తించదని కోర్టులో బలంగా వాదించాయి.

Advertisement

వివరాలు 

కేసును పూర్తిగా ఉపసంహరించుకుంటూ అమెరికా న్యాయశాఖ నిర్ణయం

నిందితులంతా భారతీయులేనని, ప్రాజెక్టులన్నీ భారతదేశంలోనే జరిగాయని, బాండ్ల వ్యవహారంలో పెట్టుబడిదారులకు ఎలాంటి నష్టం జరగలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. లంచం ఆరోపణలను నిరూపించడానికి సరైన ఆధారాలు లేకపోవడంతోనే కేసును సెక్యూరిటీల మోసం కోణంలోకి మళ్లించారని అదానీ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. చివరకు ఈ వాదనలతో ఏకీభవించిన అమెరికా న్యాయశాఖ కేసును పూర్తిగా ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది.

Advertisement