US Work Permits: అమెరికా వలస విధానాల్లో మరో కీలక మార్పు.. వర్క్ పర్మిట్ల రెన్యువల్స్ రద్దు..
ఈ వార్తాకథనం ఏంటి
వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు వలసదారుల పని అనుమతులు (US Work Permits) ఆటోమేటిక్‌గా పొడిగించే విధానాన్ని రద్దు చేస్తూ, ఆ ప్రాక్టీస్‌కు ముగింపు పలికింది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనివల్ల వేలాది విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయులు (Indians in US),తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా. హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటన ప్రకారం, అక్టోబర్ 30 నుంచి లేదా ఆ తర్వాత వర్క్ పర్మిట్ (Employment Authorization Document-EAD) రీన్యువల్ కోసం దరఖాస్తు చేసే వారికి ఇకపై ఆటోమేటిక్ పొడిగింపు అందుబాటులో ఉండదు.
వివరాలు
ట్రంప్ సర్కారు కొత్త రూల్స్
అయితే, ఈ తేదీకి ముందు తమ పని అనుమతులను రీన్యూ చేసుకున్నవారిపై ఈ నిర్ణయం ప్రభావం చూపదు. ప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాలను రక్షించడమే ఈ కొత్త నిబంధనల ఉద్దేశ్యమని ఆ విభాగం స్పష్టం చేసింది. ఇంతకు ముందు బైడెన్ ప్రభుత్వం కాలంలో,వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసినా 540 రోజుల పాటు అమెరికాలో పనిచేసే అవకాశం ఉండేది. కానీ,ట్రంప్ సర్కారు ఆ విధానాన్ని నిలిపివేస్తూ తాజా మార్పులను ప్రవేశపెట్టింది. ఇక నుంచి వలసదారులు తమ పని అనుమతుల గడువు ముగిసేలోపే ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
వివరాలు
అమెరికాలో ఉద్యోగం అనేది ఒక అవకాశం మాత్రమే
"EAD రీన్యువల్ కోసం దరఖాస్తు ఆలస్యం చేస్తే తాత్కాలికంగా పని అనుమతులు రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వర్క్ పర్మిట్ గడువు ముగియడానికి 180 రోజుల ముందే దరఖాస్తు సమర్పిస్తే మంచిది" అని USCIS (U.S. Citizenship and Immigration Services) సలహా ఇచ్చింది. అమెరికాలో ఉద్యోగం అనేది ఒక హక్కు కాదని, అది కేవలం అవకాశం మాత్రమేనని USCIS డైరెక్టర్ జోసెఫ్ వ్యాఖ్యానించారు.
వివరాలు
EAD అంటే ఏమిటి?
ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) అనేది ఒక వ్యక్తి నిర్దిష్ట కాలం పాటు అమెరికాలో పనిచేయడానికి చట్టబద్ధ అనుమతి ఉన్నదని నిర్ధారించే పత్రం. ఈ పత్రం ఉన్నవారికే అమెరికాలో ఉద్యోగం చేయడానికి అధికారిక అనుమతి లభిస్తుంది. గ్రీన్ కార్డ్‌తో శాశ్వత నివాస హోదా పొందిన వారికి ఈ పత్రం అవసరం లేదు. అలాగే H-1B, L-1B, O, P వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాలతో ఉన్నవారికి కూడా వేరుగా ఈ పత్రం అవసరం ఉండదు. కానీ గ్రీన్ కార్డు ప్రక్రియలో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, అలాగే F-1 లేదా M-1 విద్యార్థి వీసాలు లేదా డిపెండెంట్ వీసాలపై అమెరికాలో ఉంటున్న వారు ఉద్యోగం చేయాలనుకుంటే తప్పనిసరిగా EAD పొందాలి.