LOADING...
Lawrence Bishnoi: నిజ్జర్ హత్యకేసులో కీలక మలుపు.. లారెన్స్ బిష్ణోయ్‌పై అమెరికాలో కేసు
నిజ్జర్ హత్యకేసులో కీలక మలుపు.. లారెన్స్ బిష్ణోయ్‌పై అమెరికాలో కేసు

Lawrence Bishnoi: నిజ్జర్ హత్యకేసులో కీలక మలుపు.. లారెన్స్ బిష్ణోయ్‌పై అమెరికాలో కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు అతడి సన్నిహితుడు గోల్డీ బ్రార్‌పై అమెరికాలో కేసు నమోదు చేశారు. నిజ్జర్ హత్యకు సంబంధించి వీరిద్దరి నుంచి ఆదేశాలు వెళ్లినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అంతర్జాతీయ స్థాయిలో 'ఆపరేషన్ హార్డ్‌బాల్' చేపట్టింది. ఈ ఆపరేషన్ కింద అమెరికా,కెనడా, ఐరోపాలోని పలు ప్రాంతాల్లో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 24 మంది అనుమానితులను అధికారులు అరెస్టు చేశారు.

వివరాలు 

2023లో హత్య.. భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలకు కారణం

ఈ పరిణామాల నేపథ్యంలోనే లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై అధికారికంగా అభియోగాలు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, గోల్డీ బ్రార్ ఆచూకీ తెలిపిన వారికి 50 వేల అమెరికన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ 2023లో బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు భారత్-కెనడా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అయితే ట్రూడో ఆరోపణలను భారత్ పూర్తిగా తిరస్కరించింది. అలాంటి ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించాలని,నిరాధార వ్యాఖ్యలను అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది.

వివరాలు 

దౌత్య వివాదం.. సంబంధాల పునరుద్ధరణ

అయినప్పటికీ కెనడా తన ఆరోపణలను కొనసాగించింది. నిజ్జర్ హత్యకేసు దర్యాప్తులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్, కెనడా పరస్పరం తమ దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాయి. అయితే అనంతరం మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తాజాగా అమెరికాలో నమోదైన ఈ కేసు నిజ్జర్ హత్య దర్యాప్తులో మరో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Advertisement