
US Visa: విదేశీ విద్యార్థులపై అమెరికా సర్కార్ కఠిన చర్యలు.. 6,000 మంది విద్యార్థుల వీసాలు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు బీబీసీ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ ధృవీకరించింది. వారిలో 4,000 మంది దేశ చట్టాలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. వీరిలో దాడులు, మత్తులో వాహనాలు నడపడం, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడిన వారు ఉన్నారు. అంతేకాదు, అమెరికా చట్టంలోని INA 3B సెక్షన్ ప్రకారం ఉగ్రవాద సంబంధిత చర్యలకు పాల్పడిన దాదాపు 300 మంది కూడా ఈ జాబితాలో భాగమయ్యారు. ముఖ్యంగా కొత్త విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈ వీసా రద్దుల వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం.
Details
అంతర్జాతీయ విద్యార్థులను దేశ బహిష్కరణ చేసే అవకాశం
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థలో విస్తృత మార్పులు చేపడుతున్నారు. ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని పలు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. వీటి ప్రభావం అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూలంగా పడుతోంది. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో యాంటీసెమిటిజమ్ (యూదులపై వ్యతిరేకత)ను అరికట్టేందుకు బిల్లును ఆమోదించారు. ఆదేశాల ప్రకారం, పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపట్టిన అంతర్జాతీయ విద్యార్థులను దేశ బహిష్కరణ చేసే అవకాశముంది. అలాగే జూన్‌లో విదేశీ విద్యార్థుల కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను నిలిపివేయాలని ట్రంప్ కార్యవర్గం నిర్ణయించింది. అనంతరం సోషల్ మీడియా వెట్టింగ్‌ను మరింత కఠినతరం చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా తమ సామాజిక మాధ్యమ ఖాతాలను బహిర్గతం చేయాల్సిందేనని ఆదేశించారు.
Details
జాతీయ భద్రతకు ముప్పు
విద్యార్థుల పోస్టులు, కామెంట్లు, లైకులు వంటి వాటిని అమెరికా అధికారులు సమీక్షించి, జాతీయ భద్రతకు ముప్పు లేదని భావించినప్పుడే వీసా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇక కీలక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు కేటాయించిన నిధుల్లో కూడా భారీ కోతలు విధించారు. కొన్ని క్యాంపస్‌లలో పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులను అరెస్టు చేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులను నియమించకుండా బ్లాక్ చేయగా, ఈ నిర్ణయంపై ట్రంప్ ప్రభుత్వం మరియు విశ్వవిద్యాలయం మధ్య న్యాయపోరాటం కూడా ప్రారంభమైంది. గతేడాది గణాంకాల ప్రకారం అమెరికాలో దాదాపు 10 లక్షలకుపైగా అంతర్జాతీయ విద్యార్థులు చదువుతున్నారు. వీరి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థకు 43.8 బిలియన్ డాలర్ల ఆదాయం లభించిందని NAFSA అసోసియేషన్ వెల్లడించింది.